19-11-2025 12:02:40 AM
-వర్తక సంఘంపై ఆరోపణలు బాధాకరం
-వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు జారతి శ్రీనివాస్
వరంగల్, నవంబర్ 18(విజయక్రాంతి): వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న టెండర్ ప్రక్రియపై ఇటీవల కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలను సంఘం అధ్యక్షుడు జారతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మార్కెట్‌లో వ్యాపారులు, గుమస్తాలు, హమాలీ కార్మికుల మధ్య ఎన్నాళ్లగానో నమ్మకంగా కొనసాగుతున్న పద్ధతిని కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు.కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఏళ్ల తరబడి ఒకటిగా కలిసి టెండర్ పద్ధతిని పారదర్శకంగా అమలు చేస్తూ, వ్యాపారం సజావుగా నడిచే లా కృషి చేస్తున్నారని తెలిపారు.
మార్కెట్‌లో పనిచేసే గుమస్తాలు, హమాలీ కార్మికులు లేదా వ్యాపారులు అనారోగ్యంతో మరణిస్తే, వారి కుటుంబాలకు వర్తక సం ఘం తరఫున ఆర్థిక సహాయం అందించడం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నదన్నారు. టెండర్ రోజున, రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకురాగానే, ముందురోజు ఉన్న రేట్లకే కొనుగోలు చేయడం, ఎలాంటి అదనపు కమీషన్ లేకుండా చెల్లించడం వర్తక సంఘం నైతికత అని ఆయన తెలిపారు. కొంతమంది స్వప్రయోజనాల కోసం సొసైటీ పేరుతో కొత్తగా గుంపులు ఏర్పరచి, వర్తక సంఘంపై అబద్ధ ఆరోపణలు చేయడం బాధాకరమని శ్రీనివాస్ తెలిపారు.