21-11-2025 12:03:12 AM
నల్లగొండ, నవంబర్ 20 (విజయక్రాంతి): ఆహార భద్రతలో భాగంగా దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం అయన నల్లగొండ జిల్లా కేంద్రం లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని, ఇది 2030 వరకు కొనసాగించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, జర్మనీ యూరోపియన్ దేశాలలో సైతం ఇలాంటి పద్ధతి లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయని చెప్పా రు.
ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023-24 సంవత్సరంలో రూ.2.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. ప్రతినెల తెలంగాణకు 1.11 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని, 1లక్ష టన్నుల బియ్యం, 3,370 టన్నుల గోధుమలను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
బాయిల్ రైస్ లక్ష్యాన్ని పెంచాలి: ఉత్తమ్ మంత్రి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు 2024-25 సంవత్సరానికి సంబంధించి బాయిల్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని, పదేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్న రూ.1400 కోట్ల సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి సబ్సిడీ రూ.343 కోట్లు వెంటనే విడుదల చేయాలని, 2024-25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కాలపరిమితిని 60 రోజులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
బత్తాయి కోల్ స్టోరేజ్ మంజూరు చేయాలి: కోమటిరెడ్డి మంత్రి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ధి చెందిందని, జిల్లాలో 2500 టన్నుల సామర్థ్యం కలిగిన బత్తాయి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని కోరారు. నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, భారత ఆహార సంస్థ ఈడి వనిత శర్మ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కలెక్టర్ జె.శ్రీనివా స్, ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్ రాజు పాల్గొన్నారు.