calender_icon.png 11 May, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లు అలా అనుకోవాలనే సక్సెస్ మీట్ చేశాం

11-05-2025 12:03:27 AM

నాని కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హిట్: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ.. “ఈ సక్సెస్ సెలబ్రేషన్ చేసే ముందు మేం బాగా చర్చించుకున్నాం. దేశంలో పరిస్థితి ఎంతో సున్నితంగా ఉంది కదా సెలబ్రేషన్స్ చేయొచ్చా అనే చర్చించాం. శత్రువులు మనకు ఒక సమస్యను సృష్టించాలని ప్రయత్నించారు.

దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది. ‘మనం చేసిన పనివల్ల ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ రద్దయింది’ అన్న సంతృప్తి కూడా వాళ్లకు మిగలకూడదన్న ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం. మనల్ని ఏమీ చేయలేకపోయారని స్టేట్‌మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది.

సైన్యంలో ఉన్న అందరికీ బిగ్ సెల్యూట్. ‘హిట్3’ విషయానికొస్తే.. ఈ సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. శైలేశ్ ప్రతి సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు. తనకు హిలేరియస్  కామెడీ టైమింగ్ ఉంది.

తనతో నేను చేయబోయే నెక్స్ సినిమా మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓ ఆలోచన చెప్పాడు చాలా బాగుంది” అన్నారు. ‘ఇది అద్భుత ప్రయాణం’ అని హీరోయిన్ శ్రీనిధిశెట్టి చెప్పింది. డైరెక్టర్ శైలేశ్ మాట్లాడుతూ.. ‘జనం థియేటర్లకు రాని సమయంలో ఒక మంచి హిట్ ఇచ్చారని అందరూ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది’ అని తెలిపారు.

నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. ‘నాని సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు మేమందరం ఇక్కడ సర్వైవ్ కాలేవు అని చెప్పేవాళ్లం. కానీ సర్వైవ్ అవ్వడమే కాదు.. చాలా గొప్పగా ఎదిగాడు. తనలాగా ఎందరో స్ట్రగుల్ అయినవాళ్లు ఎదిగేలా చేశాడు’ అన్నారు. హీరో అడివి శేష్, నటీనటులు పావని, శ్రీనాథ్ మాగంటి, అమిత్, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.