27-12-2025 01:48:44 AM
దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి తెరకెక్కించిన ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమనర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలై, థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విజయోత్సవం నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “కరోనాలో రిలీజ్ చేసిన మా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మా ‘బ్యాడ్ గాళ్స్’ను ఆదరిస్తున్నారు. ఎంత కాంపిటీషన్‌లో ఉన్న హిట్టు కొడతామని మా నిర్మాతలు నమ్మారు.. అదే నిజమైంది. ఎంతో నిజాయితీగా అమ్మాయిల కోసం తీసిన చిత్రమిది” అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఇంకా షోలు, స్క్రీన్‌లు పెంచమని థియేటర్ల నుంచి అడుగుతున్నారని చెప్పారు.
డిమాండ్ మేరకు స్క్రీన్లను, షోలను పెంచుతున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన నటీనటులు రోషన్ సూర్య, పాయల్ చెంగప్ప, రోషిణి, మొయిన్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి కూడా మాట్లాడారు.