07-05-2025 12:35:18 AM
-కేంద్ర ప్రభుత్వానికి పీస్ డైలాగ్ కమిటీ విజ్ఞప్తి
-మావోయిస్టు పార్టీ ముందుకు వచ్చినా మొండిగా ఉండడం ప్రజాస్వామికం కాదు
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీపై కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వానికి పీస్ డైలాగ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన సమావేశమైంది.
చర్చలకు కేంద్రం ఒప్పించేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రజా స్వామిక వాదులు, అన్ని రాజకీయ పార్టీలు, దళిత, ఆదివాసీ, విద్యార్థి, మత మైనార్టీ వివిధ ప్రజా సమూహాలు ప్రజా స్వామిక పద్దతిలో శాంతి యుత నిరసనలతో ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చింది. కమిటీ సభ్యులు కంది మల్ల ప్రతాఫ్ రెడ్డి, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, సి.హె.బాలకిషన్ రావు, ఆత్రం భుజంగరావు, రహమాన్ ఎడిటర్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, సోమ రామ మూర్తి, అజయ్ బాల్నే, హరిఫ్రిత్, అడ్వకెట్ వెంకన్న(ఐఏపిఎల్), బండి దుర్గా ప్రసాద్, హాజరైన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసారు.
మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు సిద్ధం అని, అనువైన వాతావరణం ఏర్పాటు చేయాలని వారి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పత్రికా ముఖంగా ప్రకటన చేసి తదుపరీ మూడు సార్లు ఆ పార్టీ చర్చలకు సిద్ధం అని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తూ కర్రె గుట్ట ఆపరేషన్ ను వేలాది బలగలాతో కొనసాగించడం ప్రజా స్వామ్య విధానం కాదని పీస్ డైలాగ్ కమిటీ అభిప్రాయ పడింది.
పీస్ డైలాగ్ కమిటీ పిలుపు తరువాత దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సమూహాలు స్పందించి శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలని ఉద్యమిస్తున్నారని తెలిపింది. ఇంకా ఒత్తిడి పెంచాలని దేశ వ్యాప్తంగా ప్రజా స్వామిక వాదులకు, అన్ని ప్రజా సమూహానికి, రాజకీయ పార్టీలకు శాంతి కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ కేవలం కేంద్ర ప్రభుత్వం-మావోయిస్టు పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు రావాలని కమిటీ పిలుపు ఇచ్చింది.
ఈ తీర్మానానికి లోబడే కమిటీ సభ్యులు ఆయా వేదికల మీద, మీడియా ముందు మాట్లాడాలి, వ్యక్తి గత అభిప్రాయాలను కమిటీ అభిప్రాయాలుగా ప్రకటించడానికి కమిటీ వ్యతిరేకం అని తెలిపింది. అనంతరం కమిటీ అధ్యక్షులుగా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, ఉపాధ్యక్షులుగా కంది మళ్ళ ప్రతాఫ్ రెడ్డి, కో-ఆర్డినేటర్ గా బండి దుర్గా ప్రసాద్, ముఖ్య సలహాదారులుగా ఫ్రొఫెసర్ హరగోపాల్ లను కమిటీ ఎన్నుకుంది. ఇప్పటి దాక ఉన్న ఆడహాక్ కమిటీని రద్దు చేసి ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిటీ తీర్మానం చేసింది. తదుపరి మీటింగ్ వరకు రాష్టంలో నిర్మాణం, శాంతి సభలు, ర్యాలీలు చేయాలని తీర్మానం చేసింది.