24-12-2025 12:00:00 AM
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.
ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై ఒక్కో సంఘటన వారీగా కలెక్టర్ సవివరంగా విచారణ జరిపారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని వివరాలు ఆరా తీస్తూ, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు, అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు.
అంతకుముందు గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని నిబంధనలు పాటిస్తూ, తగిన అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ ద్వారా పుట్టబోయే శిశువు ఆడ లేదా మగా అని లింగ నిర్ధారణ చేస్తే, పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లకు అనుమతుల జారీ, రెన్యువల్ చేసే సమయంలో పార్కింగ్, ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా లేవా అన్నది పక్కాగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత శాఖల నుండి నిరభ్యంతర పత్రాలు తెచ్చిన వారికి మాత్రమే అనుమతులు, రెన్యువల్ చేయాలన్నారు.
ఈ సమావేశాలలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి పరమేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్వేత, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.