19-09-2025 12:44:31 AM
-రోడ్డెక్కి ధర్నా చేసిన విద్యార్థినులు
-మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘటన
మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిం చే టీచర్ లేక సిలబస్‌లో వెనుకబడుతున్నామని, తక్షణమే టీచర్‌ను నియమించాలని డి మాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. విద్యార్థులు తరగతులను బ హిష్కరించి ర్యాలీగా మండల విద్యా వనరుల కేంద్రానికి వచ్చారు.
అక్కడ ఎంఈఓ ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో సోషల్ టీచర్‌ను నియమించకపోవడం వల్ల విద్యా బోధన ముందుకు సాగడం లేదని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేదెలా అంటూ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో దేవేంద్ర చారి అక్కడికి చేరుకొని.. టీచర్ నియామకానికి ఇప్పటికే జిల్లా విద్యాధికారికి తెలియజేశామని, ఒక టీచర్‌ను డిప్యూటేషన్ ఇవ్వగా, ఆయన విధుల్లో చేరకపోవడం వల్ల ఇబ్బందిగా మారిందని చెప్పారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకొని శుక్రవారంలోగా సోషల్ టీచర్‌ను పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు.