04-05-2025 12:00:00 AM
సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. షెడ్యూల్ ట్రైబ్స్ వారిని తాను ఎంతగానో గౌరవిస్తానని, ప్రేమిస్తానని, వారూ మన సమాజంలో ఒక ముఖ్య భాగమని భావిస్తానని విజయ్ దేవరకొండ తన తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “రెట్రో ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని ఇబ్బంది పెట్టాయనే విషయం నా దృష్టికి వచ్చింది. కానీ నా మాటల్లో ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. నేను మన సమాజంలో ఐక్యత ఉండాలి.. ఒక్కటిగా మనమంతా ముందుకెళ్లాలనే చెప్పాను.
దేశమంతా ఒక్కటిగా నిలబడాలని మాట్లాడాను. మానవ జాతి తొలినాళ్లలో ట్రైబ్స్, క్లాన్స్‌గా ఉండేవాళ్లం. ఆ ఉద్దేశంతో ట్రైబ్ అనే మాట వాడాను. ఈ మాటకు ఎవరైనా హర్ట్ అయితే చింతిస్తున్నాను. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మాధ్యమాన్ని ఉపయోగిస్తాను” అని రాసుకొచ్చారు.