26-07-2025 12:32:27 AM
సభలో రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం, జులై 25 (విజయక్రాంతి) విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్ - 142) రాష్ట్ర అధ్యక్షుడు కె వి రామారావు పేర్కొన్నారు. శుక్రవారం కేటీపీఎస్ ఏ కాలనీలోని యూ నియన్ ప్రాంతీయ కార్యాలయం లో యూనియన్ 13 వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేశారు.
తొలుత కేటీపీఎస్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. వార్షికోత్సవ సభలో రామారావు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల హక్కుల సాధనకై నిరంతరం పోరాడే కార్మిక సంఘం (హెచ్-142)అన్నారు. కార్మికులు సంఘటితంగా ఉండాలని, ప్రైవేటీకరణను మూకుమ్మడిగా ఎదుర్కోవాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఆ పరిస్థితి రాష్ట్రంలో రానివ్వద్దన్నారు. ఆర్టిజన్స్ కు విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని అలాగే ఓ అండ్ ఎం కార్మికుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని వాటిపై ఇటీవల విద్యుత్ యాజమాన్యాలకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు ప్రాంతీయ నాయకులు ఎస్ శ్రీనివాస చారి, డి సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్, ఎం శివరాం, తోలేం కోటేశ్వరరావు, మధు, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.