29-10-2025 12:00:00 AM
చైర్మన్ డాక్టర్ జేడీ మోసెస్
మేడ్చల్, అక్టోబర్ 28(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ గ్రామంలోని భారత్ బైబిల్ కాలేజీకి పూర్వవైభవం తీసుకువస్తామని చైర్మన్ డాక్టర్ జె డి మోసెస్ తెలిపారు. మంగళవారం భారత్ బైబిల్ కాలేజీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1969లో కాలేజీ ప్రారంభమైందని, ఎంతోమంది గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారని, ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక అస్తవ్యస్తంగా తయారైంది అన్నారు.
అధ్యాపకులు, విద్యార్థులు లేక ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. డైరెక్టర్ జోబు లక్ష్మారెడ్డి నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జోబు లక్ష్మారెడ్డిని గతంలోనే డైరెక్టర్ పదవి నుంచి తొలగించామని అయినప్పటికీ కాలేజీలో తిష్ట వేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. భూమికి సంబంధించిన రికార్డులను, ఇతర విలువైన పత్రాలను ఆధీనంలో పెట్టుకున్నాడని, భవనానికి తాళాలు వేశాడని తెలిపారు.
ఈనెల 27వ తేదీన గవర్నింగ్ బాడీ సమావేశమై మరోసారి జోబు లక్ష్మారెడ్డి ని డిస్మిస్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఈయనపై మొత్తం 37 అభియోగాలు ఉన్నాయని అన్నారు. పోస్టింగ్ ఆర్డర్ కాపీ లేకుండా బిబిసి డైరెక్టర్, కార్యదర్శిగా అధికారాన్ని చట్ట విరుద్ధంగా వినియోగిస్తున్నరని ఆయన పేర్కొన్నారు. కాలేజీలోకి తాము రాకుండా అడ్డుకుంటున్నారని, బాడీగార్డులను, రౌడీ షీటర్లను సెక్యూరిటీగా పెట్టుకున్నారన్నారు.
బైబిల్ కాలేజీ కి చెందిన విలువైన స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బి బి సీ సొసైటీ బైలాసును ఉల్లంఘించారని, ఫోర్జరీ సంతకాలు చేశారని, బ్యాంకు నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేశారని ఆయన తెలిపారు.
అవినీతి అక్రమాలు చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్ ల మీద అక్రమ కేసులు బనాయించాడని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ డాక్టర్ టి ప్రశాంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యామ్యూల్ బూరగ, కోశాధికారి జాకబ్ చిన్నప్ప పాల్గొన్నారు.