calender_icon.png 14 August, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధికుక్కలపై తీర్పును పరిశీలిస్తాం

14-08-2025 01:15:34 AM

- సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశరాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలోని వీధి కుక్కలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వీధి కుక్కల దాడులతో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోం దంటూ  వస్తున్న వార్తలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వీధికుక్కలు ఉండటానికి వీల్లేదని తీర్పునిచ్చారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా కుక్కల తరలింపును అడ్డుకోనేందుకు ప్రయత్నించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని.. జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది. కాగా ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు ధ్వజమెత్తాయి. కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ సైతం ఢిల్లీలో ఉన్న 3 లక్షల వీధి కుక్కలను తరలించేందుకు 3 వేల షెల్టర్లు కావాలని, ఇందుకు అవసరమైన రూ.15 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు ప్రముఖులు సైతం అత్యున్నత న్యాయస్థానం తీర్పును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలోనే సీజే గవాయ్ తాజా వ్యాఖ్యలు చేశారు.