calender_icon.png 22 January, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్టుషాపులను తరిమికొట్టి తీరుతాం

22-01-2026 12:26:02 AM

షాద్‌నగర్, జనవరి, 21 (విజయక్రాంతి): గ్రామాన్ని ‘బెల్టు షాపుల రహిత గ్రామం’గా తీర్చిదిద్దేందుకు గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నడుం బిగించారు. మద్యపాన మహమ్మారి వల్ల సామాన్య కుటుంబాలు చితికిపోతున్నాయని, యువత పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ క్షేమం కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి రాజీ లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఒత్తిడి తెచ్చినా కొందుర్గులో బెల్టు షాపుల నిర్మూలన జరిగి తీరుతుంది అని గ్రామ సర్పంచ్ చౌడపురం ప్రభాకర్ ప్రకటించారు.

గ్రామంలో అధికారికంగా ఉన్న రెండు వైన్ షాపులకు అదనంగా 20కి పైగా బెల్టు షాపులు నడుస్తుండటంపై సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ వ్యాపారాల వల్ల సామాన్యుల బతుకులు ఆగం అవుతున్నాయని ఆవేదన చెందారు. బెల్టు షాపులను తొలగించే క్రమంలో తనపై రాజకీయంగా లేదా ఇతర మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని, అయితే వేటికీ భయపడకుండా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. వీధికో బెల్టు షాపు వెలవడంతో గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. సుమారు 20కి పైగా బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టాలని గ్రామ సభలో గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. 

పంచాయతీలో ప్రతిజ్ఞ

తీర్మానం చేసిన వెంటనే సర్పంచ్ ప్రభాకర్, పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులతో కలిసి నేరుగా వైన్ షాపుల వద్దకు వెళ్లారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయవద్దని యజమానులకు విఘ్నప్తి చేసారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులందరితో మద్యానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

తహశీల్దార్ కు వినతి పత్రం

గ్రామస్తుల నిర్ణయానికి ప్రభుత్వ మద్దతు కోరుతూ, బెల్టు షాపులను శాశ్వతంగా మూసివేయించాలని కొందుర్గు తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రయోజనాల కోసం సర్పంచ్ మరియు గ్రామస్తులు తీసుకున్న ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేఖ, ఉపసర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు,వివిధ యువజన సంఘం సభ్యులు,గ్రామ యువకులు ,  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.