03-11-2025 05:09:08 PM
మోకు దెబ్బ జిల్లా సంఘం అధ్యక్షులు చేపూరి కనకా గౌడ్
కుభీర్ మండల గీత కార్మికుల సమావేశంలో సన్మానం
కుభీర్ (విజయక్రాంతి): గీత కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జిల్లా సంఘం అధ్యక్షులు చేపూరి కనుక గౌడ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సోమవారం మండలంలోని ఆయా గ్రామాల గీత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, పెన్షన్లు రానివారు ఎందరో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు.
చెట్లు గీయనిదే పూట గడవని పరిస్థితిలో ఎందరో గౌండ్లు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సాధించుకునేందుకు గీత కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి జి. మురళి గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముష్కం అశోక్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చేపూరి కనకా గౌడ్ లను గౌడ కులస్తులు, గీత కార్మికులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు.