06-12-2024 01:01:24 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో , డిసెంబర్ 5, (విజయక్రాంతి): పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కలెక్టరేట్‌లో గురువారం హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ముషీరాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో అర్హులైన 81 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తుందన్నారు. త్వరలో దీనికి సంబంధించిన యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. అర్హులైనవారిని గుర్తించి పారదర్శకం గా ఈ ఏడాది 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణ కోసం రూ. ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రం లో 18 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వాటి కంటే ఎక్కువ ఇండ్లు ఇస్తారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు నిత్యం అనేక మంది వలస వస్తున్నారని, వారికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా దాదాపు రూ.7వేల కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ పనుల్లో భాగంగా అండర్‌పాస్‌లు, ఫ్లు ఓవర్లు నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, డిప్యూ టీ మేయర్ శ్రీలత, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, డీఆర్వో వెంకటాచారి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు తమకు ఎందుకు ఇండ్లు ఇప్పించలేదని నాయకులు, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు.