31-12-2025 12:00:00 AM
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ భేష్
రాష్ర్టంలో 2.33 శాతం తగ్గిన క్రైమ్ రేట్
38.72 శాతానికి పెరిగిన శిక్షల రేటు
సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ దేశానికే దిక్సూచి.. రూ. 246 కోట్ల రికవరీ
ఆందోళన కలిగిస్తున్న బ్రీ ఆఫ్ ట్రస్ట్ కేసులు
మావోయిస్టుల ఏరివేతలో సక్సెస్.. 509 మంది లొంగుబాటు
వార్షిక నివేదిక- విడుదల చేసిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ర్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి తేల్చిచెప్పారు. ‘ఆధారాలు లభించే కొద్దీ విచారణ లోతుగా కొనసాగుతోంది. చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున, దీనిపై బహిరంగంగా ఎక్కువ వివరాలు వెల్లడించలేం’ అని డీజీపీ పేర్కొన్నారు.
మంగళ వారం డీజీపీ కార్యాలయంలో జరిగిన మీడి యా సమావేశంలో ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక- విడుదల చేశారు. ఏడాదిలో పోలీస్ శాఖ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, గణాంకాలను ఆయన సవివరంగా వెల్లడించారు. ‘తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నా యి. టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుని, ప్రజల భద్రతే పరమావధిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది.
ఫలితంగా ఈ ఏడాది రాష్ర్టం లో నేరాల రేటు గణనీయంగా తగ్గింది’. అని డీజీపీ స్పష్టం చేశారు. అయితే, హత్యలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సమాజంలో మను షుల మధ్య నమ్మకం సన్నగిల్లుతోందని, ఫలితంగా నమ్మకద్రోహం కేసులు 23 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన విశ్లేషించారు.
నేరాల రేటులో తగ్గుదల..
రాష్ర్టంలో నేరాల నియంత్రణకు తీసుకున్న పటిష్ట చర్యలు సత్ఫలితాలను ఇచ్చా యని డీజీపీ తెలిపారు. 2024లో రాష్ర్టవ్యాప్తంగా మొత్తం 2,34,158 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 2,28,689కి తగ్గింది. అంటే ఓవరాల్‌గా 2.33 శాతం నేరాలు తగ్గాయి.
భారతీయ న్యాయ సంహి త కింద నమోదైన కేసులు కూడా 1.69 లక్షల నుంచి 1.67 లక్షలకు 1.45 శాతానికి పడిపోయాయి. ప్రధానంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే దోపిడీలు ఏకంగా 27 శాతం తగ్గాయి. అలాగే అత్యాచారాలు 13.45 శాతం, దొంగతనాలు 9.1 శాతం, హత్యలు 8.76 శాతం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా 9.5 శాతం మేర తగ్గుముఖం పట్టాయని వివరించారు.
సైబర్ వార్‌లో తెలంగాణ విజయం
దేశమంతా సైబర్ నేరాలతో సతమతమవుతుంటే, తెలంగాణ పోలీసులు మాత్రం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు 41 శాతం పెరగగా, తెలంగాణలో మాత్రం 3 శాతం తగ్గుదల నమోదైంది. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులకు న్యాయం చేయడంలో పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ ఒక్క ఏడాదే నేరగాళ్ల ఖాతాల నుంచి రూ. 246 కోట్లను ఫ్రీజ్, రికవరీ చేశారు.
ఇందులో రూ.159.65 కోట్లను కోర్టు అనుమతులతో 24,498 మంది బాధితులకు తిరిగి ఇప్పించారు. సీఈఐఆర్ పోర్టల్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రోజుకు సగటున 111 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, నేరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీస్ శాఖ గణనీయమైన ప్రగతి సాధించింది. గత ఏడాది 35.63 శాతంగా ఉన్న శిక్షల రేటు, ఈ ఏడాది 38.72 శాతానికి పెరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు
రాష్ర్టవ్యాప్తంగా పల్లె పోరును ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కల్పించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంభవించిన భారీ వరదల సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేశారు.
ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోగా, అందులో 23 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. అని డీజీపీ తెలిపారు.
పెరిగిన నమ్మకద్రోహం..సామాజిక మార్పులే కారణం
నేరాలు తగ్గినప్పటికీ, క్రిమినల్ బ్రీ ఆఫ్ ట్రస్ట్ కేసులు 23 శాతం పెరగడంపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాములే మో సం చేస్తున్న ఘటనలు ఇందులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ గొడవలు, చిట్ ఫండ్ మోసాలు, వడ్డీ వ్యాపారాల్లో నమ్మించి మోసం చేయడం వంటివి పెరిగాయని, ప్రజలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పతకాల పంట ..
తెలంగాణ పోలీసులు విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ సత్తా చాటారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ జార్ఖం డ్: 18 పతకాలతో దేశంలోనే నంబర్ వన్ చాంపియన్. ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ 10 పతకాలు సాధించారు.
మహిళా అధికారుల హవా..
పోలీస్ శాఖలో మహిళలకు పెద్దపీట వేశామని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం అనేక కీలక పదవుల్లో మహిళా ఐపీఎస్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, మహిళా భద్రత కోసం షీ టీమ్స్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయని ప్రశం సించారు. వరకట్న హత్యలు కూడా 2 శాతం తగ్గాయని తెలిపారు.
పోలీసులపై రాజకీయ విమర్శలు తగదు..
‘పోలీసు వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదు. మేం ఎవరి డైరెక్షన్‌లోనూ పనిచేయడం లేదు. మేం ఫాలో అయ్యేది కేవలం ఖాకీ బుక్ చట్టం.. పోలీస్ మాన్యువల్ మా త్రమే’ అని రాష్ర్ట డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ర్టంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తు న్న విమర్శలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఆయ న ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలంగా పోలీసులపై వస్తున్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. మేం చట్టానికి లోబడి పనిచేస్తున్నాం.. కాబట్టే రాష్ర్టంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. అన్ని గణాంకాలను పరిశీలించిన తర్వాతే మేం మాట్లాడు తున్నాం. రాజకీయ లబ్ధి కోసం పోలీసుల మనోధైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయడం సరికాదు అని హితవు పలికారు.
