12-09-2025 01:26:03 AM
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం భూదాన్ భూములను అమ్ముకొని భూదాన యజ్ఞం బోర్డును లేకుండా చేసిందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు ఆరోపించారు. భూధాన్ పోచంపల్లి మున్సిపల్ టూరిజం పార్కులో గురువారం నాడు ఆచార్య వినోబాబావే 130 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధమ భూదాత వెదిరి రామచంద్రారెడ్డి, ఆచార్య వినోబాబావే కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ ఏప్రిల్ 18, 1951 లో 100 ఎకరాల భూమితో భూదానోద్యమం ప్రారంభమైందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భూమిలేని నిరుపేదలకు భూమిని పంచి పెట్టాలని ఉద్దేశంతో 44 లక్షల మందిని గుర్తించి భూదానం చేసిన గొప్ప చరిత్ర బోధన పోచంపల్లికి ఉందన్నారు. పేదలకు విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాల కు ఉపయోగపడే భూదాన భూములను గత ప్రభుత్వం భూదాన యజ్ఞ బోర్డును లేకుండా చేసిందని వారు మండిపడ్డారు. భూదాన్ పోచంపల్లి లో తయారుచేసి ఇక్కత్ చీరలను డూప్లికేట్ ప్రింటెడ్ చీరలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకుంటామ న్నారు.
అదేవిధంగా 75వ భూధాన్ వజ్రోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భూదాన్ పోచంపల్లికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూదాన్ యజ్ఞం బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు భరత్ లవ కుమార్, బీసీసీ ఉపాధ్యక్షులు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు తడక వెంకటేష్, సామ మధుసూదన్ రెడ్డి, అంబరీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానయ్య, సీత శ్రీరాములు, తడక యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.