14-10-2025 12:00:00 AM
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు
కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): అగ్రవర్ణాల కుట్రలను తిప్పికొడదామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో ఆమోదం పొంది జీవో 9 తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా హైకోర్టు లో పిటిషన్ వేసి స్టే రావడానికి కారణమైన రెడ్డి జాగృతి నేతలకు, బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల నాయకులకు త్వరలోనే బుద్ధి చెప్తామన్నారు .స్టే వచ్చిన వెంటనే అహంకారపూరితమైన అగ్రవర్ణ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం శోచనీయం అన్నారు.
బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారని మా బహుజనుల సత్తా ఏందో భవిష్యత్తు లో అగ్రవర్ణాలకు చూపెడతామని హెచ్చరించారు. బీసీలందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి 42 శాతం రిజర్వేషన్లు తెచ్చుకుంటామన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు అబ్రబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు అబ్రబోయిన స్వామి,మర్రి శేఖర్, నల్లపు రమేష్, నల్లపు రాజేందర్, మల్లేష్, పూలబోయిన శంకర్ పాల్గొన్నారు.