27-01-2025 11:38:15 PM
ముల్తాన్: పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ 35 ఏళ్ల తర్వాత టెస్టుల్లో విజయాన్ని అందుకుంది. ముల్తాన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో విండీస్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 163 పరుగులు చేయగా.. పాక్ 154 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. 253 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆతిథ్య పాక్ 133 పరుగులకే కుప్పకూలి 120 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 76/4తో మూడో రోజు ఆటను ఆరంభించిన పాక్ ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. కేవలం 57 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడం గమనార్హం. బాబర్ ఆజం (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ (5/35), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుదకేశ్ (2/35)తో పాక్ పతనాన్ని శాసించారు. జోమెల్ వారికన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కడం విశేషం. ఇక 1990లో పైసలాబాద్ టెస్టులో గెలిచిన విండీస్ ఆ తర్వాత 1997, 2006లో పాక్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఒక్క విజయం సాధించలేకపోయింది. రెండు టెస్టుల సిరీస్ 1 డ్రా ముగిసింది.