15-05-2025 02:27:35 AM
అపోహలు తొలగించి, అభివృద్ధి చేయండి
అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): వేములవాడ దేవాలయ మూసివేత అంశంపై జరుగుతున్న ఆందోళనలు, నెలకొన్న పరిస్థితులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరా తీశారు. బుధవారం ఈ అంశంపై ఎండోమెంట్ కమిషనర్, వేములవాడ ఆలయ ఈవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెలకొన్నాయని మంత్రికి ఆలయ సిబ్బంది వివరించారు.
భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం, భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నట్లు మంత్రికి చెప్పారు.
అయితే స్థానికంగా అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని మంత్రి సురేఖ సూచించారు. ఎక్కడా ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు.