27-05-2025 12:27:22 AM
కామారెడ్డి,మే 26 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. కొన్నిచోట్ల సగం వరకే పనులు చేసి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మరికొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.
కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లుగా నామకరణం చేసింది. జిల్లాలో గత ప్రభుత్వం హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పట్టించుకునే వారు కరువయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగం గా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని నిర్ణయించారు.
అయితే చాలా గ్రామాల్లో నిర్మాణ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పలు చోట్ల పనులు పూర్తయినా లబ్ధిదారులకు అందించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ భవనాలు నిరుపయోగంగా మారాయి. బీఆర్‌ఎస్ హయాంలో 201617లో నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పనుల కోసం అప్పటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.2.5 కోట్లతో ఇళ్లు నిర్మించి పేదలకు అందించాలని నిర్ణయించారు. ఆ ఇళ్ల నిర్మాణాలు శ్లాబ్ ల వరకు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మిగతా పనులు ఆపేశారూ.
బాన్సువాడలో అత్యధికం
కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఇళ్లు మంజూరు చేయించి, లబ్ధిదారులకు అందజేశారు. మిగతా నియోజవర్గాల్లో డబుల్ ఇళ్లపై పట్టించుకోలేదు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందించలేదు.
కామారెడ్డి పట్టణంలోని నరసన్నపల్లి సమీపంలో నిర్మించిన రెండు పడకల గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో ప్రజలు నేరుగా వెళ్లి వాటిల్లోనే నివాసం ఉన్నారు. దీంతో అధికారులు స్పందించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. లింగంపేట మండలం ఎల్లమ్మ తండాలో కూడా ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో పలువురు నివాసం ఉంటున్నారు.
తెరపైకి ఇందిరమ్మ ఇళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు కూడా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
అలాగే నిర్మాణం పూర్తియిన ఇళ్లను అర్హులకు అందించాలని వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి.. గోపాల్‌పేటలో అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.