08-11-2025 12:00:00 AM
-అయిజలో మార్కెట్ ఏర్పాటుకు మంత్రి హామీకి ఏడాది పూర్తి
-ఇప్పటికి యార్డు ఊసే లేని వైనం
-ధాన్యం పక్క రాష్ట్రాల్లో విక్రయిస్తున్న రైతాంగం
అలంపూర్, నవంబర్ 7: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న అయిజ మండలం అత్యధిక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా పేరుంది.అయిజతో పాటు పరిసర ప్రాంత గ్రామాలలో మంచి సారవంతమైన నేలలు ఉండడం చేత రైతులు అత్యధికంగా పత్తి మిరప,వరి, మొక్కజొన్న,కంది వంటి తదితర పంటలను సాగు చేస్తారు.అన్ని మండలాలతో పోల్చుకుంటే అయిజలో జన సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.అయిజ అటు కర్ణాటక ఇటు ఏపీ రాష్ట్రానికి సరిహద్దు కేంద్ర ఉంటుంది. ఇక్కడ వాణిజ్యపరంగా అతిపెద్ద కమర్షియల్ స్పేస్‌గా దిన దినాకి అభివృద్ధి చెందుతోంది. కానీ అయిజకు అందుకు తగ్గ వసతులు సదుపాయాలు కరువయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి మార్కెట్ యార్డ్ లేక రైతులు పండించిన పంటను విక్రయించేందుకు పక్క రాష్ట్రం పోవాల్సి దుస్థితి ఏర్పడింది.
పత్తి మిరప వంటి వాణిజ్య పంటలను విక్రయించేందుకు కర్ణాటక లోని రాయచూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమ్మిగనూరు, ఆదోని, గుంటూరు కి తీసుకెళ్తుంటారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం ప్రజా ప్రతినిధులు విఫలముతున్నారని చెప్పొచ్చు. అలంపూర్ చౌరస్తా ఉన్న మార్కెట్ యార్డులో రైతులకు సరైన వసతులు సదుపాయాలు లేవు.ఇప్పటి వరకు యార్డులో మార్క్ ఫెడ్ ద్వారా శనగలు,మొక్కజొన్న,కందులు వంటి తదితర పంటలను కొనుగోలు మాత్రమే జరుపుతారు.కానీ అయిజ పరిసర ప్రాంత ప్రజలకు దూరం కావడంతో వ్యవ ప్రయాసాల నడుమ ధ్యానాన్ని మార్కెట్ కు తీసుకురావడం రైతులకు కష్టతరంగా మారుతోంది. దీంతో కర్ణాటక ఏపీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఏడాది పూర్తయిన మంత్రి హామీ
గత ఏడాది సెప్టెంబర్ 13 న అలంపూర్ చౌరస్తాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో మంత్రి జూపల్లి కృష్ణారావు విచ్చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఈ ప్రాంత ప్రజలను రైతులను ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అందులో భాగంగా అతి త్వరలో అయిజకు నూతన మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
మంత్రి మాటలు నీటి మీద రాతలే అన్నట్టు ఏడాది గడిచిన ఇప్పటి వరకు మార్కెట్ ఊసే లేదనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని పండుగలా చేసే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన..ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా మారిందని ఈ ప్రాంత రైతాంగం ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయిజ పట్టణ కేంద్రంలో నూతన మార్కెట్ యార్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.