calender_icon.png 24 August, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సొసైటీలకు మోక్షమెప్పుడు?

24-08-2025 01:12:49 AM

-నూతనంగా 434 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు నిర్ణయం

-ఫిబ్రవరిలో ముగిసిన గత పాలకవర్గం పదవీకాలం 

-ఇన్‌చార్జి పాలకవర్గంలోనే కొనసాగుతున్న వైనం

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి):  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో  కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న  పాథమిక వ్యవసాయ సహకార (పీఏసీఎస్) సంఘాలు కాగితాలకే పరిమితమైనాయి. రాష్ట్రంలోని 584 మండలాల్లో    909 సొసైటీలు ఉన్నాయి. అదనంగా మరో 434  వరకు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్నది. అందుకు ప్రతి మండలానికి రెండు సంఘాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని మండల కేంద్రాల్లో రెండు పీఏసీఎస్‌లున్నాయి. 272 మండల కేంద్రాల్లో  ఒక్క సొసైటీ ఉండగా, 81 మండల కేంద్రాల్లో ఒక్క  సంఘం కూడా లేదు. అంతేకాకుండా కొన్నిచోట్ల రెండు, మూడు గ్రామాలు కలిపి ఒక సొసైటీ ఉండగా, మరికొన్ని సొసైటీలకు 20 నుంచి 30 గ్రామాల వరకు ఉన్నాయి. ఒక సంఘంలో 500 మంది సభ్యులు ఉంటే.. మరికొన్ని సంఘాల్లో వేల మంది సభ్యులు ఉన్నారు. రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ఇతర సేవలు అందించేందుకు సంఘాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

2013 తర్వాత కొత్త సంఘాల ఏర్పాటు లేదు..  

రాష్ట్రంలో 2013 తర్వాత కొత్త సంఘాలు ఏర్పాటు చేయలేదు. నూతన సహకార విధానం కింద దేశంలోని ప్రతి గ్రామంలో పీఏసీఎస్, మత్స్య, పాల ఉత్పత్తిదారులు సంఘం ఏర్పాటు చేయాలని 2022లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార సంఘాలు సమావేశం నిర్వహించి 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక సొసైటీ ఉండేలా నిర్ణయించాయి. కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా ముందడుగు పడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త సోసైటీల ఏర్పాటు కోసం పాత సొసైటీ పాలకవర్గమే తీర్మానం చేయాలి. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జి పాలకవర్గంలో ఎలాంటి తీర్మానాలు చేయడానికి అవకాశం లేనందున కొత్త సొసైటీల ఏర్పాటు ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు.  

ఇన్‌చార్జి పాలకవర్గంతో ముందుకు సాగని అభివృద్ధి 

ప్రస్తుతమున్న పీఏసీఎస్‌లకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. 2025 ఫ్రిబవరి 14తో పీఏసీఎస్ పాలక వర్గం పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిసేలోపే కొత్త సొసైటీలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని భావించి ప్రభుత్వం జిల్లాల నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నది. అయినప్పటికీ సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో పీఏసీఎస్‌ల గత పాలవర్గం పదవీకాలాన్ని మొదటిసారి ఆరు నెలలు  పొడిగించింది.  రెండోసారి కూడా మరో ఆరునెలల వరకు పాత కమిటీలనే ఇన్‌చార్జ్‌లుగా కొనసాగిస్తూ సర్కార్ ఈ నెల 14న ఉత్తర్వులు ఇచ్చింది.

దీంతో  పీఏసీఎస్‌లకు ఇప్పట్లో ఎన్నికలు లేవని చెప్పకనే చెప్పిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కోసం రైతులు  తిప్పలు పడుతున్న సమయంలో  పీఏసీఎస్‌లకు పాలక వర్గం లేకపోవడం సర్కార్‌కు మైనస్‌గా మా రుతుందని, పాలన పడకేసిందని రైతులు విమర్శిస్తున్నారు. రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న సొసైటీల్లో భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం వంటి పనులు చేయలేకపోతున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు విషయంలోనూ పరిమితులకు లోబడే ఇవ్వాల్సి వస్తోంది. ట్రాక్టర్లు, బంగారుం రుణాలు, టర్మ్‌లోన్స్, కోళ్ల ఫారాలు, ఇతర పెద్ద షెడ్ల నిర్మాణాలకు రుణాలు మంజూరు కావడం లేదు.