02-12-2025 07:58:24 AM
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
జహీరాబాద్ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పేలుడు బాధితులకు చెల్లించాల్సిన రూ.కోటి పరిహారం ఎప్పుడిస్తారని, ఆలస్యం చేయడంలో ఆంతర్యమేమిటని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ లకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సిగాచి ఘటన జరిగి నాలుగు నెలలు పూర్తయినా ఇంతవరకు బాధితులకు పరిహారం అందించక పోవడం శోచనీయమన్నారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు కంపెనీ నుంచి ప్రభుత్వం తరపున రూ.లక్ష మాత్రమే అందించారని తెలిపారు. ఆప్తులను పోగొట్టుకొని అందాల్సిన పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నా వారి సమస్య పరిష్కారం కోసం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన వెంటనే పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.2 లక్షల పరిహారం కూడా అందలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి పరిహారమైనా వెంటనే చెల్లించే వారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గడీల శ్రీకాంత్‌గౌడ్, బుచ్చిరెడ్డి, మోహిజ్ ఖాన్, ఆర్.వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.