05-12-2025 12:12:57 AM
దేశంలో రెండు రోజుల్లో 300 విమాన సేవలు రద్దు కావడం ఒకిం త ఆశ్చర్యం కలిగించింది. ఈ లెక్కన ప్రయాణికుల ఆకాంక్షలను నెరవేర్చడంలో పౌర విమానయాన సంస్థలు విఫలమవుతున్నట్లుగా అని పిస్తున్నది. టికెట్ రేట్లు ఎక్కువే అయినప్పటికీ సమయం వృథా అవదనే కారణంతో చాలా మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఎయిరిండియా, ఇండిగో లాంటి విమానయాన సంస్థలు.. సాంకేతిక లోపం, ఇతరత్రా కారణాలతో తరచూ విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
తాజాగా ఇండిగో విమానయాన సంస్థ బుధవారం ఒక్కరోజే దాదాపు వందకుపైగా విమానాలు రద్దు చేయడం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. కొంతకాలంగా ఇండిగో, ఎయిరిండియా సహా ఇతర విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలతో విమానాలు రద్దవ్వడం చూస్తూనే ఉన్నాం. విమాన సర్వీసుల రద్దుకు సాంకేతిక లోపాన్ని మాత్రమే ప్రధాన కారణం గా చూపలేం. చలికాలం కావడంతో ఫ్లుటై షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతా వరణ పరిస్థితులు, విమాన వ్యవస్థ ట్రాఫిక్, ఫ్లుటై డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ సహా కారణాలు అనేకం.
మంగళ, బుధవారాల్లో ఢిల్లీ, పుణే, బెంగళూరు వంటి పెద్ద విమానాశ్రయాల్లో చెక్ ఇన్, డిపార్చర్ కంట్రోల్ వ్యవస్థలో లోపాలు చోటుచేసుకోవడం వల్ల పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య కారణంగా చెక్‌ఇన్, డిపార్చర్ కంట్రోల్ వ్యవస్థలో ఇబ్బందులు వచ్చాయని ఇండిగో సంస్థ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ మాత్రం ఇండిగో ఆరోపణలను తోసిపుచ్చింది.
కాగా విమానయాన సంస్థ పూర్తిగా కంప్యూటర్ వ్యవస్థపై ఆధారపడి నడుస్తోందన్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌లో 250కి పైగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముందని విమానాల తయారీ కంపెనీ ఎయిర్ బస్ ముందస్తుగానే హెచ్చరించింది. ఎయిర్ బస్ ఏ-320 సిరీస్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సమాచారానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని, దీనివల్ల ఫ్లుటై కంట్రోల్ సిస్టమ్ ఎఫెక్స్ అవ్వనున్నట్లు పేర్కొంది.
భారత్‌లో ఎక్కువగా నడిచే ఇండిగో, ఎయిరిండియా విమానాల్లోనే పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశముందని ఎయిర్ బస్ తెలిపిం ది. కాగా ఏ-320 సిరీస్‌కు చెందిన 560 విమానాలను భారత్ నడుపుతోంది. ఇందులో సగం విమానాల్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉంది. ఇండిగో, ఎయిరిండియా సహా అన్ని ఎయిర్ లైన్స్‌లో మార్పులు చేసేందుకు అధికారులు ఇప్పటికే సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ బస్ సూచన ప్రకారం విమానాల్లో కావాల్సిన మార్పులను చేయనున్నట్లు ఇండిగో కూడా ఇప్పటికే ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఇండిగో తీరుపై కేంద్ర విమానయాన శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నవంబర్ ఒకటి నుంచి కొత్త కఠిన డ్యూటీ టైమ్ నిబంధనలు అందుబాటులోకి రావడంతో ఇండిగో సహా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు పైలట్, కేబిన్ క్రూ కొరతను ఎదుర్కొంటున్నాయని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలి పింది. అన్ని విమానయాన సంస్థలతో సమన్వయంతో పనిచేసి సమస్యకు ముగింపు పలుకుతామని డీజీసీఏ స్పష్టం చేసింది.