17-06-2025 12:00:00 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న వివిధ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరై, ఇదే వేదికపై ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. “శేఖర్ చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. ఆయన నమ్మిన సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకు.. నేను చేసే సినిమాలకు సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ‘కుబేర’ ఒక సస్పెన్స్ సినిమాలా అనిపిస్తోంది. దీనికోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నా” అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. “ధనుష్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి, మమ్మల్నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ‘మాయాబజార్’ కేవీరెడ్డి ఫిల్మ్ అంటాం. కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం” అన్నారు. హీరో ధనుష్ మాట్లాడుతూ.. “శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు.
నేను చాలా కంగారు పడ్డాను. అక్కినేని నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగిన నేను.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది” అన్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “ఏదైనా చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి. ప్రతి సినిమా కూతురు లాంటిది, కొడుకు లాంటిదని చెప్తుంటా. ‘కుబేర’ మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడైనా.. కోటీశ్వరుడైనా.. తల్లిప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా సరస్వతీదేవి తలెత్తుకొని చూస్తుంది.
నాకోసం నాగార్జున ఇందులో భాగమయ్యారు. ధనుష్.. ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలని చెప్తే.. అలానే కనిపించాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఒక డైరెక్టర్ తనను సన్నబడమని చెప్పారని, నిజంగానే సన్నబడి చూపించాడు. తనకు ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినా తక్కువే. తోట తరిణి నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకు అద్భుతమైన వర్క్ ఇచ్చారు” అన్నారు. రష్మిక మందన్న మాట్లాడుతూ.. “శేఖర్ కమ్ములతో పనిచేయాలని ఉండేది. ఆ అవకాశం ఈ సినిమాతో దొరికింది. ఇది గొప్ప అదృష్టంగా భావి స్తున్నా.
ధనుష్‌తో పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్. మా కెమిస్ట్రీ చూసి కొత్త సినిమాలు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నా. ఆయనతో మరోసారి కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నా” అన్నారు. నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ.. “శేఖర్ కమ్ముల ఒక డిఫరెంట్ స్టుల్లో సినిమాలు తీసే అద్భుతమైన ఫిలిం మేకర్. ఈ సినిమానూ అంతే విభిన్నంగా తీశారు” అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయితలు భాస్కర్ భట్ల, నందకిషోర్, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, మూవీ యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.