calender_icon.png 19 October, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థి మృతి మిస్టరీని ఎందుకు ఛేదిస్తలేరు?

18-10-2025 01:44:47 AM

-ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు  తీసుకోరా?

-పోలీసులు, అధికారులపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్

-వారంలో ఉపాధ్యాయులపై చర్యలకు సిఫారసు చేయాలని కమిషన్ డైరెక్టర్ ఆదేశాలు

-నెల రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదిక ఇస్తామని వెల్లడి

హుస్నాబాద్, అక్టోబర్ 11 : సిద్దిపేట జిల్లా జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సనాదుల వివేక్(13) అనుమానాస్పద మృతిపై కొనసాగుతున్న మిస్టరీ ఇంకా ఛేదించబడలేదు. విద్యార్థి మరణం వెనుక ఉన్న వాస్త వాలు బయటపెట్టడంలో అధికార యం త్రాంగం విఫలమైందని తల్లిదండ్రులు, దళి త సంఘాల నాయకులు మండిపడుతున్నా రు. దీంతో ఈ కేసుపై నెలకొన్న నిర్లక్ష్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. విచారణ వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.

శుక్రవారం ఆ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు నేతృత్వంలోని బృందం జిల్లెలగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టింది. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగ్రవాల్, ఏసీపీ సదానందం, ఆర్డీవో రామ్మూర్తి, డీఎస్పీ, మెడికల్ సూపరింటెండెంట్, గురుకుల ప్రిన్సిపాల్, బోధనా సిబ్బందితో వేర్వేరుగా సమావేశమై సునీల్ కుమార్ బాబు వివరాలు సేకరించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషన్ బృందం, విద్యార్థి తల్లిదండ్రులు, సహ విద్యార్థులను విచారించింది. పాఠశాల వాతావరణం, భద్రతా చర్యలు, సీసీ కెమెరా ఫుటేజ్లు, హాస్టల్ పర్యవేక్షణ విధానాలపై విపులమైన సమాచారం తీసుకుంది.

విచారణ అనంతరం కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు  మీడియాతో మాట్లాడారు. విద్యార్థి మృతిపై విచారణ కొనసాగుతోంది. ప్రతి అనుమానాస్పద అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఒక వారంలో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై తీసుకున్న చర్యల వివరాలను అధికారులు సమర్పించాలి. లోపాలు తేటతెల్లమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవు, అని అన్నారు. దీంతో పాటు తమ కమిషన్ విచారణ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇస్తామ న్నారు. నెల రోజుల్లో పూర్తి నివేదికను సిద్ధం చేసి  ప్రభుత్వానికి అందజేస్తాం. దోషులు ఎవ్వయినా వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

దర్యాప్తులో నిర్లక్ష్యంపై అసంతృప్తి

విద్యార్థి మృతి కేసు దర్యాప్తులో ఆలస్యం, సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యంపై పోలీసుల పాత్రను కూడా కమిషన్ గమనించినట్లు స మాచారం. దర్యాప్తు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. వివేక్ మృతి తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, విద్యాశాఖ అధికారులు వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. విద్యార్థుల భద్రత, పర్యవేక్షణలో లోపాలపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మా బిడ్డ న్యాయం పొందాలంటే బాధ్యులందరినీ బహిర్గతం చేయాలి అని వివేక్ తల్లిదండ్రులు అన్నారు.

మీ కాళ్లు మొక్కుతాం.. కడుపుకోత పెట్టినోళ్లను కాపాడకండి..

కమిషన్ అధికారులను కలిసిన మృతుడి  తల్లిదండ్రులు లావణ్య, సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. పాఠశాల వాళ్లు నిర్లక్ష్యం చేశారు. మా బిడ్డ మృతికి బాధ్యులు శిక్షించబడాలి అని వారు విజ్ఞప్తి చేశారు. మాకు కడుపుకోత పెట్టినోళ్లను కాపాడొద్దంటూ  తీవ్ర ఆవేదనతో కమిషన్ డైరెక్టర్ కాళ్లు మొక్కారు. మా బిడ్డ మృతికి కారణం తెలుసుకోవాలి, న్యాయం జరగాలి అని వారు కమిషన్ బృందానికి విన్నవించారు. జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం తర్వాత కేసు కొత్త దిశలో సాగుతుందనే నమ్మకంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు.