08-08-2025 12:48:38 AM
నిజామాబాద్ ఆగస్టు 7 (విజయ క్రాంతి) : మొగుపాల్ మండలంలోని భైరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిరామ్ నాయక్ తాండా గిరిజన రైతు రామావత్ ప్రకాష్ నాయక్ కు జొన్నపంటను ఫారెస్ట్ అధికారులు గడ్డి మందు కెమికల్స్ చల్లి పంట నష్టం చేయడానికి ప్రయత్నించడంతో మనస్థాపం చెందిన ఆయన ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలుసుకున్న జిల్లా న్యాయసేవ అధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు గురువారం మోతిరామ్ నాయక్ తాండాకు చేరుకుని కాల్చిన జొన్నపంటనుపరిశీలించారు.
తాండా గిరిజనులను కలిసి ప్రకాష్ ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి గల కారణాలు, వ్యవసాయ భూముల వివరాలను తెలుసుకున్నారు. ఫారెస్ట్ భూములు ఎంత, అటవీ ప్రాంతమెంత, రేవిన్యూ భూములు ఎంత వారి నుండి ఏమైనా అవగాహన ఉందా అంటు వాకబు చేశారు. మంచిప్ప చిన్ననీటి ప్రాజెక్టును విస్తరస్తున్న మూలంగా, ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఏమైనా వ్యవసాయ భూములు ముంపుకు గురి అయితే అవి నీటిపారుదల శాఖ అదీనంలోకి వెళుతున్నాయా అంటు ఆరా తీశారు.
ప్రకాష్ గిరిజన రైతు అతహత్యయత్నానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, సదరు రైతు స్వంత వ్యవసాయ భూమియేన అని అడిగారు. రైతు ఎన్నో ఏళ్లనుండి భూమిని సాగు చెస్తున్నాడని, జొన్నపంట వేసి మూడు నెలలు కావస్తోందని, మరకొన్ని రోజుల్లో కోతకచ్చే పంటను అటవీ శాఖ అధికారులు కెమికల్స్ కలిపిన మందు చల్లి మంట పెట్టారని గిరిజనులు జడ్జికి వివరించారు. ఫారెస్ట్ అధికారులతీరు గిరిజన జీవితాల భద్రతకు ముప్పుగా మారిందని వారు తెలిపారు.
రైతుపైనే ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసినట్లు మొగుపాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుష్మిత తెలిపారు. అటవీ భూమిలో ప్రకాష్ అనే రైతు అక్రమంగా సాగుచేయడంతో అడ్డుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు జడ్జికి విన్నవించారు.
అందరి నుండి విషయసేకరణ చేసిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు న్యాయం ఏదిక్కున ఉంటే దానివైపు నిలబడతామని, చట్టం అందరికి చట్టమేనని, చట్టానికి బద్దులుగా ఉండాలని సూచించారు. జడ్జి వెంట న్యాయవాదులు ఆశ నారాయణ, బాల్రాజ్ నాయక్, రవిప్రసాద్, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ శైలజ ఉన్నారు