08-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ‘సమాజంలో టీచర్లు గౌరవ ప్రదమైన వారు కనుక వారు జరుపుకునే సభలు, సమావేశాలకు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతోంది’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఫతి వారు ప్రకటించినట్టుగా ఒక్కసారిగా 30వేల మంది ఎల్‌బీ స్టేడియంలోకి వస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని..
ఒకవేళ బండ్లగూడలోని అరోరా ఇంజనీరింగ్ క్యాంపస్‌లో అధ్యాపకుల సభ నిర్వహిస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని.. అక్కడి ప్రాంగణంలో శాంతి, భద్రతల పర్యవేక్షణకు హోం శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. 14వ తేదీ తరువాత ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించేందుకు ఫతి వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది పేర్కొ న్నారు. సాంత్వన సభ నిర్వహణకు అనుమతి కోరుతూ ఫతి నేతలు గురువారం హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టగా హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్ ముందు వాదనలు జరిగాయి. తదనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ఈ నెల 14వ తేదీ తరువాతే ఫతి వారు తమ సమావేశాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో శనివారం ఎల్‌బీ స్టేడియంలో తలపెట్టిన అధ్యాపకుల సాంత్వన సభతో పాటు హైదరాబాద్‌లో పది లక్షల మంది విద్యార్థులతో నిర్వహించనున్న లాంగ్ మార్చ్ ర్యాలీ కూడా వాయిదా వేస్తున్నట్లు ఫతి ఒక ప్రకటలో ప్రకటించింది.