04-01-2026 12:34:21 AM
రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు
న్యూఢిల్లీ, జనవరి ౩: ఢిల్లీ అల్లర్ల కేసులో ‘ఉపా’ చట్టం కింద అరెస్టు ౨౦౨౦ నుంచి రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించనున్నది. గత డిసెంబర్ 10న ఇరుపక్షాల తరఫున వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, వీరిద్దరి బెయిల్ పిటిషన్‌పై గతేడాది సెప్టెంబర్ 2న విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఖలీద్, షర్జీల్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు ఐదేళ్లుగా తాము జైలులోనే ఉంటున్నామని వారు కోర్టుకు తెలిపారు. విచారణ జాప్యం అవుతున్నందున తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఉమర్ ఖలీద్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు నిందితులు పెద్దకుట్రకు పాల్పడ్డారని వాదించిన సంగతి తెలిసిందే.