09-07-2025 12:56:01 AM
అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కగార్
నేషనల్ పార్క్‌ను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు
బీజాపూర్, జూలై 8: బీజాపూర్ అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘మాకు లొంగిపోతారా.. ఎన్‌కౌంటర్‌లో పోతారా అనేది నిర్ణయించుకోండి’ అని మావోయిస్టులకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు అగ్రనేతలు గణపతి, కమాండర్ మడావి హిడ్మా, మరో అగ్రనేత దేవా టార్గెట్‌గా మరో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌లో భాగంగా 20 వేల మంది భద్రతా సిబ్బంది నేషనల్ పార్క్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కూంబింగ్ విషయమై పౌర హక్కుల నేతల ఆందోళనలు కూడా దీనికి పరోక్షంగానే అవుననే సమాధానం చెబుతున్నాయి.
నేషనల్ పార్క్ ఆపరేషన్‌ను వెంటనే నిలిపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. దీంతో ఏ క్షణమైనా ఎన్‌కౌంటర్ జరగొచ్చని పౌరహక్కుల నేతలు టెన్షన్ పడుతున్నారు.
ఐఈడీ పేలుడు.. జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మంగళవారం అవాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామాల మధ్య సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడులో గాయపడిన జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.