calender_icon.png 23 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డఫీ దెబ్బకు విండీస్ చిత్తు

23-12-2025 12:40:10 AM

న్యూజిలాండ్‌దే టెస్ట్ సిరీస్

బే ఓవల్, డిసెంబర్ 22 : ఊహించిందే జరిగింది. న్యూజిలాండ్, విండీస్ మూడో టెస్ట్ చివరిరోజు సంచలనాలేమీ నమోదు కాలేదు. కివీస్ పేసర్ జాకబ్ డఫీ దెబ్బకు కరేబియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ పోరాటం చూసిన తర్వాత చివరిరోజు డ్రా కోసం విండీస్ ప్రయత్నిస్తుందేమోనని అనుకున్నారు. అయితే కరేబియన్ బ్యాటర్లు మాత్రం క్రీజులో నిలవలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 323 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

వికెట్ నష్టపోకుండా 43 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్‌ను డఫీ దెబ్బకొట్టాడు. హాఫ్ సెంచరీతో రాణించినా బ్రాం డన్ కింగ్ ఔటవగానే మిగిలిన బ్యాటర్లు క్యూ కట్టారు. 95 పరుగుల తేడాలో ఆ జట్టు 10 వికెట్లు కోల్పోయింది. బ్రాండ్ కింగ్ 67 పరుగులు తేయగా.. మిగిలిన బ్యాటర్లంతా నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ 5 వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 575/8 పరుగుల భారీస్కోరు చేసింది.

ఓపెనర్ డెవాన్ కాన్వే (227) డబు ల్ సెంచరీతో చెలరేగాడు. అలాగే టామ్ లా థమ్ (137) సెంచరీ సాధించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. చక్కని పోరాట పటిమతో 420 పరుగులు చేయగలిగింది. హాడ్జ్ సెంచ రీ చేయగా.. బ్రాండన్ కింగ్(63), క్యాంప్‌బెల్ (45) రన్స్‌తో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ ఓపెనర్లు కాన్వే, లాథమ్ మళ్లీ సెంచరీలతో దుమ్మురేపారు.

దీంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 306/2 దగ్గర డిక్లేర్ చేసింది. తర్వాత 452 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించలేక విండీస్ చేతులెత్తేసింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2 కైవసం చేసుకుంది. డెవాన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, జాకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది.