calender_icon.png 10 September, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేక పవనాలు

05-09-2025 12:47:18 AM

యూరియా కోసం రైతులకు తప్పని ఇబ్బందులు

చెన్నూర్, సెప్టెంబర్ 4 : యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే పోలీసులతో దాడి చేయించిన ఘటనతో రైతుల్లో మంత్రి గడ్డం వినోద్ వెంకట స్వామిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావ డం, మెదక్ జిల్లాకు ఇంఛార్జీ మంత్రిగా కాం గ్రెస్ ప్రభుత్వం నియమించిన నాటి నుంచి నియోజక వర్గ ప్రజలను సరిగ్గా పట్టించుకోవడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు.

మెదక్ జిల్లాపై చూపించిన శ్రద్ద మంత్రి పదవి రావడానికి కారణమైన నియోజన వర్గంపై చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎరువులను నియోజక వర్గానికి ఎక్కువగా మంత్రి తెప్పించారని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లెక్కల్లో ఎరువులు తెప్పించినట్లు చూపిస్తున్న అధికారులు, అవి ఎవరికి చేరినాయో పరిశీలిస్తే దొంగలెవరో భయటకు వస్తుందని, ఇతర జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు ఎన్ని ఎరువుల బస్తాలు వెళ్లాయో బయటపడుతుందని రైతులు వాపోతున్నారు.

ఎరువులు నియోజక వర్గానికి పంపించింది దళారుల కోసమేనా..? అనే ప్రశ్నలు రైతుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం మంత్రి తీరును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. యూరియా తెప్పించాలని నినదిస్తున్నరైతులపై, మద్దతు తెలుపుతున్న నాయకులపై పోలీసుల దాడి సంఘటన నియోజక వర్గం మొత్తం దావానంలా వ్యాపించడం, రైతుల కోసం, ప్రజల సమస్యలపై పోరాడుతున్న పార్టీలకు ఈ అంశాలు లాభం చేకూరేలా కనిపిస్తున్నాయి.