27-09-2025 01:27:22 AM
ముగ్గురు పిల్లలను నాయనమ్మ వద్దే ఉంచుతున్నాడు
తన నుంచి దూరం చేస్తున్నారని అక్కసు
తొమ్మిది నెలల క్రితం ఒకరు, రెండు రోజుల క్రితం మరొకరిని చంపిన తల్లి
మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలి అరెస్టు
మహబూబాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పట్టించుకోవడంలేదని, పిల్లల్ని తన నుంచి దూరం చేసి నాయనమ్మ వద్దే ఉంచుతున్నాడనే అక్కసుతో నవమాసాలు మోసి కని పెంచిన తల్లి.. తన ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో 9 నెలల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి ఘటనలను పోలీసులు ఛేదించారు.
చిన్నారులను కన్నతల్లి శిరీష హత్య చేసిందని నిర్ధారించి, ఆమెను మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆధ్యర్యంలో శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన వివరాలు వెల్లడించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, వరంగల్ జిల్లా అలంకానిపేటకు చెందిన శిరీషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ముగ్గురు పిల్లలు మనీష్(6), మోక్షిత్, నిహాల్(18 నెలలు) జన్మించారు.
కొంతకాలంగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడంలేదని శిరీష అనుమానం పెంచుకుంది. తన పిల్లలను కూడా తనకు కాకుండా చేస్తూ అత్త మామల వద్దే ఎక్కువ సమయం ఉంచుతున్నాడనే భావించింది. ముందు తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే ముగ్గురు పిల్లలు అనాధలుగా మారుతారని, అలా కాకుండా వారిని చంపి తాను చనిపోవాలని భావించి,
ఈ ఏడాది జనవరిలో ఏడాదిన్నర వయసున్న చిన్న కుమారుడు నిహాల్‌ను ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో పడేసి చంపింది. ఈ నెల 24న ఇంట్లో ఎవరు లేని సమయంలో పెద్ద కుమారుడు మనీష్‌ను నైలాన్ తాడుతో మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఈ ఘటనపై కేసముద్రం ఎస్‌ఐ మురళీధర్ రాజ్ కేసు నమోదు చేసి శిరీషను విచారించగా, తన పిల్లలిద్దరిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు చెప్పారు. ఈ సంఘటనలో తల్లి శిరీషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీ ఐ వివరించారు.
నిహాల్ మృతదేహానికి పోస్టుమార్టం
పిల్లలిద్దరినీ తానే హత్య చేసినట్లు తల్లి శిరీష అంగీకరించడంతో ఈ ఏడాది జనవరి 15 నీటి సంపులో మరణించిన చిన్న కుమారుడు నిహాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నారాయణపురం గ్రామంలో నిహాల్‌ను పాతిపెట్టిన ప్రదేశంలో శుక్రవారం పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి ఆ తల్లికి మనసులా వచ్చిందో అంటూ ప్రతి ఒక్కరూ శాపనార్ధాలు పెట్టారు.
తొలుత నిహాల్‌ను 9 నెలల క్రితం నీటి సంపులో పడేయగా, నాయనమ్మ గమనించి వెంటనే బయటకు తీసి వైద్యుల వద్దకు తీసుకువెళ్లి ప్రాణాపాయం నుండి గట్టెక్కించింది. మళ్లీ అదే నీటి సంపులో పడేసి చంపడం, పెద్ద కుమారుడు మనీష్‌పై రెండు నెలల క్రితం గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించగా అప్పుడు కూడా నాయనమ్మ అరుపులతో బతికి బయటపడ్డాడు.
తిరిగి రెండవసారి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నైలాన్ తాడుతో గొంతుకు ఉరేసి చంపడంతో మాతృత్వానికి మాయని మచ్చగా శిరీష ఉదంతం నిలుస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు.