17-01-2026 02:05:21 AM
హరీష్ రావు ఎదుట మాచాపూర్ గ్రామస్తుల గోడు
సిద్దిపేట రూరల్ జనవరి 16:కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు కనుమరుగైందని సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామస్తులు మాజీ మంత్రి హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ చావడి (రచ్చబండ) వద్ద గ్రామ పెద్దలు, వృద్ధులు, రైతులతో హరీష్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు.కేసీఆర్ హయాంలో రూ.200 నుంచి రూ.2000కు పెరిగిన పెన్షన్ను, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4000 చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా పెంచలేదని గ్రామస్తులు వాపోయారు. కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని, వృద్ధులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రైతు బంధు అందరికీ అందడం లేదని, రుణమాఫీ కూడా కొందరికే పరిమితమైందని పేర్కొన్నారు.కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఉండేదని, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సి వస్తోందని, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆగిపోయాయని తెలిపారు.గ్రామస్తుల సమస్యలను సావధానంగా విన్న హరీష్ రావు, వారి తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. బోర్లకు సంబంధించిన పనులకు ఈ నెలలోనే టెండర్లు పూర్తవుతాయని, నెల రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.