13-08-2025 04:21:09 PM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల,(విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహిళను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వీటి ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవకాశాలు కలుగుతున్నాయని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను మహిళా సంఘాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అర్హత కలిగిన ప్రతి మహిళను సంఘాల్లో చేర్చే బాధ్యత ఏపీఎంలు, సీసీలపై ఉందని, ప్రతి అర్హురాలిని సభ్యురాలిగా చేర్చేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం ద్వారా లభించే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు.
గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు భద్రత, సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం అందించే లబ్ధులు, పథకాలపై వచ్చే సమాచారాన్ని నమ్మదగిన మార్గాల ద్వారానే పొందాలని, అనధికారిక ఆన్‌లైన్ లింకులు, మోసాలకు లోనవకూడదని మహిళలకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సాయం, రుణాలు, శిక్షణ, పథకాల అమలు వంటి అన్ని అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.