20-09-2025 09:00:56 PM
సన్న బియ్యం పథకం భారతదేశానికి ఆదర్శం
మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్
గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రస్తుత రాజకీయాలలో మహిళలు కీలక పాత్ర పోషించాలని మాజీ జెడ్పిటిసి ఎంపీపీ పెండెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు చామకూరి రజిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆయా గ్రామాల మహిళ కమిటీ అధ్యక్షురాలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళలకు వివరించాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
నియోజకవర్గాలలో విద్యాలయాల ఏర్పాట్లో మంత్రి ఉత్తమ్ కృషి అభినందనీయమన్నారు.మహిళలు చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి సులభంగా వెళ్తాయి కాబట్టి మీరందరూ కార్యక్రమాల్లో భాగస్వాములై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలు పరిపాలనలో ముందుండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి,మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్ లకు మహిళలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళా కమిటీ అధ్యక్షురాలు పలువురు మహిళలు పాల్గొన్నారు.