calender_icon.png 24 October, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగళ ట్యూబ్ పరిశ్రమలో కార్మికుడి మృతి

24-10-2025 12:05:54 AM

  1. పరిశ్రమ ఎదుట సీఐటీయూ నాయకుల ధర్నా             

కార్మికుడి కుటుంబానికి రూ.9 లక్షల నష్టపరిహారం 

జహీరాబాద్, అక్టోబరు 23 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బూచనెల్లి గ్రామ శివారులో గల మంగళ ట్యూబ్ కంపెనీలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణించారు. పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగిగా పని చేస్తున్న రోహిత్ గోగోయ్ (39) బుధవారం రాత్రి పనిచేస్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు. 

అస్సాం రాష్ట్రానికి చెందిన రోహిత్ గోగోయ్ మరణ వార్త తెలుసుకున్న సిఐటియు నాయకులు మంగళ కంపెనీ వద్దకు చేరుకొని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు నాయకులు కంపెనీ ముందు ధర్నా చేసి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ పరిశ్రమలో ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటన్నిటికీ  యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

మృతి చెందిన కార్మికుడికి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం, రూ.2 లక్షలు అంత్యక్రియలకు, మరో రెండు లక్షలు మృతదేహాన్ని తరలించేందుకు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాలరాజ్, నజీర్, శ్రీకాంత్, పులేందర్, మహబూబ్, భార్గవ్ రాజ్, కుమార్, ఉమ తదితరులుపాల్గొన్నారు.