08-11-2025 12:00:00 AM
-సింగరేణిలో గైర్హాజరు పేరుతో గాలం
-కార్మిక, ఉద్యోగుల మెడకు నిబంధనల కత్తి
-మున్ముందు జీవిత భద్రతకు పెనుముప్పు
-సింగరేణిలో చీకటి రోజులు వచ్చేశాయ్..?
-చివరికి మిగిలేవి యంత్రాలే...!
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 7: సింగరేణి లో మళ్లీ చీకటి రోజులు వచ్చేట్లున్నాయి... అంటే అవుననే సమాధానమే వస్తుంది... కార్మికులు, ఉద్యోగుల గైర్హాజను కట్టడి చేసి బొగ్గు ఉత్పత్తికి విఘాతపు చర్యలను అరికట్టే నెపంతో కార్మికులపై మరోసారి కొర డా ఝులిపించేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది.
గైర్హాజరు పేరిట మరోసారి సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల జీవిత భద్రతకు పెను ప్రమాదాన్ని తలపెట్టనుంది. ఈ మేరకు అందుకు సం బంధించిన విధివిధానాల సర్క్యులర్ విడుదల సింగరేణి లో కలకలం రేపుతుంది. గైర్హా జరు అవుతున్న కార్మికులను దశల వారీగా తగ్గిస్తూ.., ఆర్థికం గా నష్టం చేస్తూ... చివరికి ఉద్యోగ ఉద్వాసనే కార్మికులకు అఖరిశిక్షగా విధించే నిబంధనలు రంగంలోకి వచ్చాయి.
ఈ నిబంధనలు ఇప్పటికే సింగరేణిలోని ప్రతి గని నోటీస్ బోర్డులో దర్శనమి స్తున్నా యి. ఈ ఏకపక్ష నిబంధనల సర్క్యులర్ కార్మికులను ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు గురి చేసింది. ఈ నిబంధనల అమలుతో సింగరేణిలో కార్మికుల ఉద్యోగాలు తుమ్మితే ఊడి పోయే ముక్కులా మారీపోయే ప్రమాదం చోటుచేసుకుంది. అంతే కాకుండా కార్మికు లు పూర్తిగా ఉద్యోగ భద్రతను కోల్పోవడమే కాక సింగరేణిలో నూతన నియామ కాలు ఇక ఉం డవని చెప్పకనే చెప్తున్నాయి ఈ కొత్త నిబంధనలు... కార్మికుల సంఖ్యను కుదించడమే యజమాన్యం ముఖ్య విధానంగా కనిపిస్తుంది.
అప్పట్లో రన్నింగ్‌తో ఉద్యోగాలు...
సింగరేణిలో తొలిసారిగా పారదర్శకంగా ఉద్యోగాల నియామకాలు రన్నింగ్ పరీక్షలతో జరిపారు. 1985లో అప్పటి సింగరేణి సీఎండీ జీపీ రావు ఆధ్వర్యంలో సింగరేణిలో ఉద్యోగ నియమాకలను పరుగు పందెంతో చేపట్టిన చరిత్ర సింగరేణిలో ఇప్పటికీ మరువరానిదిగా నిలిచిపోయింది. ఈ చారిత్రిక ఘట్టానికి మంచిర్యాల జిల్లా తాండూ రు మండలం మాదారం పరుగు పందెం తో ఉద్యోగ నియామకాలకు వేదికైంది. ఉచితంగా ఒక్క పైసా తీసుకోకుండా పరుగు పందెంలో నెగ్గిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల నుంచి వేలాది మంది రైతుబిడ్డలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల పిల్లలు ఈ పరుగు పందెం పోటీల్లో పాల్గొన్నారు. వేల మంది పరుగు పందెం పోటీల్లో నెగ్గి సింగరేణిలో ఉద్యోగాలు సాధించుకున్నారు. కష్టజీవులు, కార్మికుల పిల్లలు, వ్యవసాయ కూలీలు, రైతులు కార్మికులుగా పరిణామం చెందారు.
తొలిసారి 1992లో నాగల పేరిట తొలగింపు...
పరుగు పందెం పోటీలలో నెగ్గి వేలాది మంది యువకులు, కార్మిక, రైతు బిడ్డలు సింగరేణిలో ఉద్యోగస్తులుగా అడుగుపెట్టారు. 1991 నూతన ఆర్థిక విధానాల పుణ్యమాని సింగరేణిలో గైర్హాజర్ పేరిట ఎంతో మంది యువకులను కంపెనీ ఉద్యోగాల నుంచి తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఉద్యోగాల తొలగింపునకు గోల్డెన్ షేక్ హ్యాండ్, సర్ఫేస్ ఫుల్, కంపల్సరీ రిటైర్మెంట్ ఇలా రకరకాల పేరిట కార్మికులను ఉద్యోగాల నుంచి క్రమంగా తప్పిస్తూ చివరికి డిస్మిస్ చేసింది. అందుకోసం కొత్త కొత్త స్కీములు పెట్టారు. అందులో భాగంగానే ఏడాదిలో 190 మస్టర్లు పూర్తి చేయాలని, అలా మస్టర్లు నింపని కార్మికులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు. దీంతో సింగరేణిలో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
భూగర్భంలో కనీస సౌకర్యా లు లేక విధులు సక్రమంగా చేయలేకపోయారనే వాస్తవాన్ని విస్మరించారు. ముమ్మాటికి ఆ కారణంగానే కార్మికులు విధులు సక్రమంగా చేయకపోవడం, తగిన మాస్టార్లు పూర్తిచేయక డిస్మిస్ అయ్యారు. సింగరేణి వ్యాప్తంగా మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిస్మిస్ కార్మికులు నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. సంవత్సరాల తరబడీ అలుపెరగకుండా చేసిన పోరాటాలకు యజమాన్యం దిగోచ్చింది. చివరికీ కొద్దిమందికైనా మళ్లీ సింగరేణిలో ఉద్యోగాలు లభించాయి. చాలామంది డిస్మిస్ కార్మికులు రిటైర్మెంట్ కి దగ్గరపడి ఉద్యోగ అవకాశాలను కోల్పోయి దుర్భరమైన జీవితాలను వెల్లదీశారు. ఆకలి చావులకు గురయ్యారు.
మరోసారి కార్మికులపై డిస్మిస్ అస్త్రం...
సింగరేణిలో కార్మికులపై మరోసారి డిస్మిస్ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ఈసారి మరింత కఠినంగా కార్మికులను చీల్చి చెండాడే విధంగా యజమాన్యం గైర్హాజరు పేరిట తొలగించే ప్రక్రియకు మళ్ళీ పదును పెట్టింది. పూర్వం మాదిరికంటే ఎన్నో రేట్ల వేధింపులు కార్మికులకు తప్పవు. మాస్టర్ల వారీగా గైర్హాజరును లెక్కకట్టి కార్మికులను మూడు కేటగిరీలుగా విభజించి, శిక్షల విధింపు ఉంటుంది. దశలవారీగా కార్మికులను ఉద్యోగ పరంగా ఓ వైపు బలహీనపరుస్తూ, నిబంధనల ముసుగులో మరోవైపు ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించే పన్నాగ ఘట్టంతో కార్మిక జీవితానికి ముగింపు పలుకనున్నారు.
గైర్హాజరుపై క్రమశిక్షణా చర్యలిలా...
కార్మికుల హాజరును బట్టి వారిపై తీసుకునే చర్యలు విరివిగా ఉన్నాయి. నిర్దిష్ట సంఖ్యలో కంటే తక్కువ రోజులు పనిచేస్తే, హెచ్చరికల నుండి ఉద్యోగం తొలగింపు వరకు శిక్షలు రకరకాలుగా ఉన్నాయి.
- సంవత్సరంలో హాజరు 150/200 రోజు ల కంటే తక్కువ ఉంటే (భూగర్భ గని కార్మికులకు 150 రోజులు, ఉపరితల (సర్పేస్) కార్మికులకు 200 రోజులు) మొదటి సారి తప్పుగా హెచ్చరిక లేఖ (వార్నింగ్ లెటర్) ఇస్తారు. పది రోజులకు మించకుండా జీతం లేని వారిని సస్పెన్షన్ విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే ఒక ఇంక్రిమెంట్ను నిలుపుదల చేస్తారు. ఇది తర్వాతి ఇంక్రిమెంట్లపై ప్రభావం చూపదు.
- సంవత్సరంలో భూగర్భ గని కార్మికులకు 100 రోజులు, ఉపరితల కార్మికులకు 150 రోజుల కంటే తక్కువ ఉంటే మొదటిసారి తప్పు చేస్తే, రెండు ఇంక్రిమెంట్లు శాశ్వతం గా నిలిపివేస్తారు. ఇది భవిష్యత్తు ఇంక్రిమెంట్లపై కూడా ప్రభావం చూపుతుంది. రెండోసారి తప్పు చేస్తే, ప్రస్తుత గ్రేడ్ నుంచి కింది స్థాయి గ్రేడ్కు మారుస్తారు. మూడోసారి తప్పు చేస్తే, ఉద్యోగం నుంచి శాశ్వ తంగా తొలగిస్తారు.
- ఏడాదిలో ఒక్క రోజు కూడా విధులకు రాకపోతే మొదటిసారి కింది స్థాయి గ్రేడ్కు మారుస్తారు. వరుసగా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం రాకపోతే, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. ఈ నిబంధనల ప్రకారం, కార్మికులు తమ హాజరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని ఈ నిబంధనలతో స్పష్టమవుతోంది.
మౌనంగా కార్మిక సంఘాలు...
సింగరేణిలో మరోసారి కార్మికుల మేడకు నిబంధన కత్తినీ తగిలించారు. గైర్హాజరు నెపంతో ఉద్యోగాల నుంచి తొలగించి కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు సరికొత్తగా యజమాన్యం సన్న ద్ధమవుతున్నది. అందుకుగానూ నిబంధనలతో కూడిన సర్క్యులర్ కూడా తెచ్చా రు. దీనిపై ఇప్పటి వరకూ కార్మిక సం ఘాల్లో ఉలుకూ, పలుకూ లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్మిక సంఘాల మౌనం కార్మి కుల ఉద్యోగ భద్రతను ఏకంగా ప్రమాదంలో పడేసింది.
సింగరేణిలో ప్రతి ఉద్యోగి జీవితంలో గైర్హాజరు శరామామూలే. పని చేస్తేనే కార్మికులకు జీవితం, వారి కుటుంబాలకు మనగడ. ఉద్దేశపూర్వకంగా ఏ కార్మికుడూ విధులకు గైర్హాజరుకాడు. ఉద్యోగాలను పోగొట్టుకొని కుటుంబాలను వీధి దీపాలు చేసుకోడు. గైర్హాజరు పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించడం కంపెనీ కర్కశ విధానాలకు పరా కాష్ట. అమానుష నిబంధనలపై కార్మిక సంఘాలు ఇప్పటికీ నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. సింగరేణిలో నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగాల తొలగింపు నిబంధన లకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల సమ్మ తి ఉంటదనీ, అందుకే వాటిపై పల్లెత్తుమా ట కార్మిక సంఘాల నుంచి కానరాకపోవడం అందుకు బలం చేకూరుస్తుంది. ఇలా అయితే సింగరేణిలో కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమే.