16-08-2024 02:39:13 AM
నాగర్‌కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): పద్దెనిమిదేళ్లు నిండి ఉండి, వాహనం నడపాలనుకునే ప్రతిఒక్కరూ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందాల్సిందే. కొత్తగా ఎవరు వాహనం కొన్నా వారు ఆర్సీ కోసం ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆ రెండింటినీ నేరుగా ఇంటికే పంపిస్తామని అన్నిరకాల ఫీజులు వసూలు చేసే రవాణాశాఖ.. వాటిని జారీ చేయడంలో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తున్నాయి. వాహనదారులు దరఖాస్తు చేసుకునని నెలలు గడుస్తున్నా ఆర్సీ , డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఇంటికి చేరడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టల్‌శాఖకు రూ.1.70 లక్షల నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి.
నిధుల కోసం ఇప్పటికే పోస్టల్‌శాఖ ఆర్టీవో కార్యాలయానికి నోటీసులను జారి చేసింది. నోటీసులను అందుకుని రెండు నెలలైనా ఆర్టీవో అధికారులు వాటిపై స్పందించలేదు. మరోవైపు ఏజెంట్ల ద్వారా వెళ్లిన వాహనదారులకు మాత్రం వెంటనే డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీని ముద్రించి ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సాధారణ వాహనదారు లకు ఆర్టీవో అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారనే తెలుస్తుంది. కార్డులు చేతికి అందనందున ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కి జేబులకు చిల్లులు పెట్టుకోవాల్సి వస్తుందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
రెండు రోజుల్లో పరిష్కరిస్తాం
రావణాశాఖలో బడ్జెట్ లేనందున పోస్టల్‌శాఖకు నిధులు విడుదల కాలేదు. ఉన్నతాధికారులను సంప్రదించి వెంటనే సమస్యను పరిష్కరి స్తాం. సిబ్బంది కార్యాలయంలో కార్డులను ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. వాటిని పరిశీలిస్తాం.
బాలూనాయక్, జిల్లా
రవాణాశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
ఆర్టీవో కార్యాలయానికి నోటీసులిచ్చాం..
వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను పంపిణీ చేసేందుకు పట్టణంలో అయితే రూ.17, రూరల్ ఏరియా అయితే రూ.41 చొప్పున చార్జ్ చేస్తాం. ఏడాది నుంచి ఆర్టీవో నుంచి రూ.1.70 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉన్నది. దీంతో మేం బట్వాడాను నిలిపివేశాం.
సృజన్ నాయక్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్, నాగర్‌కర్నూల్