26-10-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, అక్టోబర్24(విజయక్రాంతి):మహాదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎస్బిఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన యువ చైతన్య సదస్సులో మేధాకవులు, మేధావులు, వందలాది యువతీ యువకులు పాల్గొని ప్రేరణతో ఊగిపోయారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉరుమల్ల విశ్వం సారథ్యంలో జరిగిన ఈ సాదస్సుకు ముఖ్య అతిధిగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపాక అధ్యక్షుడు వెన్న పూస బ్రాహ్మరెడ్డి పాల్గొన్నారు.
మేధావులు మాట్లాడుతూ, నాయకుల వెంట తిరిగితే నాయకులు అయిపోరూ నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటేనే నువ్వు మార్పు దిశలో అడుగుపెడతావని పిలుపునిచ్చారు. సెల్ఫోన్ స్క్రీన్లలో కాదు, ఐలమ్మలాంటి పోరాటాలలోనే యువత భవిష్యత్తు దాగి ఉందన్నారు. విద్యతో పాటు సమాజానికి సేవ చేయాలనే తపన ఉండాలని సూచించారు. అలాగే, మూడు నమ్మకాలను వదిలి, మనపై విశ్వాసం, సమాజంపై బాధ్యత, దేశంపై నిబద్ధత ఇవి జీవితాన్ని మార్చే మంత్రాలని స్పష్టం చేశారు.
విజ్ఞానం వైపు అడుగులు వేయాలని, సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక ప్రపంచంలో మనకు ఆయుధమని గుర్తుచేశారు. యువతీ యువకులు విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆత్మవిశ్వాసం కలగలిపి ముందుకు సాగాలని మేధావులు సూచించారు. మంచి వస్త్రధారణ, మనోధైర్యం, ఆత్మరక్షణ, ఇవే ఆధునిక యువతీ మణుల శక్తి చిహ్నాలన్నారు. సమాజంలో చైతన్యం రగిలించేది, కొత్త దిశ చూపేది యువతేనని స్పష్టం చేశారు. విమర్శ కాదు, విజ్ఞానం నేర్చుకో ఫిర్యాదు కాదు, ప్రయత్నం చెయ్యి అని మేధావులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు కవులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ ముని మనుమరాలు చిట్యాల శ్వేత ఐలమ్మ, శ్రీ రామోజు అంజనాదేవి, పి. సుగుణాకర్ రావు, చాట్ల శ్రీధర్, కె.వేణుగోపాల్, ఎం.అలేఖ్య, బి.కాంత, సామానపల్లి లక్ష్మి, వినోద్, నటేష్, రఘరాజుపాల్గొన్నారు.