14-03-2025 12:14:58 AM
మెదక్, మార్చి 13(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేర కొత్త పథకానికి శ్రీకారం చుట్టింటి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
ప్రతీ జిల్లా నుండి సుమారుగా 10వేల మంది యువతకు ప్రయోజనం కలిగేలా ఈ పథకం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కోసం నిధుల లేమితో రుణాలు మంజూరు కాలేదు. ఎంతో మంది స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం యువ వికాసం పేరుతో కొత్త పథకానికి నాంది పలకడంతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు పెరుగుతున్నాయి.
ఈనెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ...
రాజీవ్ యువశక్తి పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.3 లక్షల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించనున్నారు. ఈనెల 15వ తేదీన పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి అదేరోజు నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు అందించనున్నారు. అయితే ప్రభుత్వం అందించే రుణంపై సబ్సిడీ ఎంత ఉంటుంది..లబ్దిదారుడు ఎంత చెల్లించాలి..బ్యాంకు రుణం ఎంత అన్న విషయాలపై స్పష్టత లేదు.
పారదర్శకంగా చేపట్టాలి...
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉపాధి పథకాల లబ్దిదారుల ఎంపిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గతంలో సైతం ఆయా పథకాలలో పార్టీ నేతల ముద్ర కనిపించేది. వారి అనునాయులకే పథకాలు వర్తింపజేశారు. రాజీవ్ యువవికాసం పథకంలో సైతం అధికార పార్టీ ముద్ర కనిపించకుండా నిజమైన లబ్దిదారులకే అందించాలని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.