23-10-2025 06:52:44 PM
నకిరేకల్ (విజయక్రాంతి): కల్లుగీత వృత్తి పట్ల యువతను ప్రోత్సహించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు దండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని నడిగూడెం గ్రామంలో, కట్టంగూర్ మండల కేంద్రంలో ఈ నెల 25న చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తి ప్రమాదకరంగా మారిందన్నారు. నేటి యువత ఆ వృత్తిపై ఆసక్తి కనబరచకుండా ఉపాధి కోసం వేరే పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. గీత వృత్తి పట్ల యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నారు.
560 జీవోని అమలు చేయాలని, ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి అట్టి భూమిలో తాటి, ఈత, ఖర్జూర పొట్టి వంగడాలను ప్రభుత్వమే సొసైటీలకు అందజేసి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా ప్రాజెక్టును ఏర్పాటుచేసి వారి నిర్వహణ బాధ్యతను గౌడ కులస్తులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘంమండల అధ్యక్ష, కార్యదర్శులు కొప్పుల అంజయ్య, గుడుగుంట్ల బుచ్చి రాములు, మాద రామరాజు, మాధ వెంకట్, మాద లింగస్వామి, రాచకొండ యాదగిరి, మాద నరసింహ, మాద సత్యనారాయణ, అభినంద్, అనంతుల నాగరాజు, రాచకొండ చిన్న సత్తయ్య, కల్లుగీత కార్మిక సంఘం కట్టంగూరు మండల అధ్యక్షుడు మద శ్రీను గౌరవ అధ్యక్షులు చౌగోనీ లింగయ్య ఉపాధ్యక్షులు పనస యాదయ్య ఆకుల శంకరయ్య ఉపాధ్యక్షులు సురిగి సత్తయ్య సహాయ కార్యదర్శి వేముల సైదులు కోశాధికారి నీలం అంజయ్య అనంతుల నరసింహ మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.