19-11-2025 10:37:12 PM
బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్..
హనుమకొండ (విజయక్రాంతి): యువశక్తి కలిగిన మన దేశంలో అత్యధికంగా యువత రాజకీయాల్లో రాణించడం చాలా ముఖ్యమని, వారు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలరని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సర్దార్ 150 జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ విగ్రహం నుండి హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హంటర్ రోడ్ సత్యం కన్వెన్షన్ హాల్ లో వరంగల్ పార్లమెంట్ బీజేవైఎం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్, మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవడం, విద్యార్థుల సమస్యలపై, నిరుద్యోగులకు బాసటగా, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండటం, మరియు చురుగ్గా రాజకీయ ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా ఇది సాధించవచ్చని అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని,ఆ హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదని గంట రవికుమార్ స్పష్టం చేశారు.ఆదాయ వనరులు పెంచుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వంవిఫలమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని, ఎన్నికలప్పుడే కష్టపడితే రాజకీయాల్లో రాణించలేమని చెప్పారు. ప్రజాప్రతినిధులకు హాలీడేస్ ఉండవని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందని, హామీలు అమలు చేయడంలో డీల పడిందని విమర్శించారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజయం సాధించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండ కట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, వరంగల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు తీగల భరత్ మరియు బీజేవైఎం రాష్ట్ర, జిల్లా పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.