30-01-2026 02:14:07 AM
హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటీ?
కాంగ్రెస్ సీనియర్ నేత మాదిరెడ్డి యుగంధర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలనలో మార్పులు తెచ్చినప్పటికీ, కూకట్‌పల్లి జోన్ పరిధిలో మాత్రం అధికారుల తీరు మారడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మాదిరెడ్డి యుగంధర్‌రెడ్డి విమర్శించారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ స్థానిక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మెలుగు తూ, అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్నారని గురువారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. బాలానగర్ కార్పొరేటర్ ఆవు ల రవీందర్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా భవనం నిర్మిస్తే జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదని, హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
అక్రమ కట్టడాన్ని కూల్చకుండా జోనల్ కమిషనర్ కాలక్షేపం చేస్తున్నారని యుగంధర్‌రెడ్డి దుయ్యబట్టారు. కేవలం అక్రమ నిర్మాణదారుల ప్రయోజనాల కోసమే అధికారులే స్వయంగా సాకులు వెతుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు. కమిషనర్ అపూర్వ చౌహాన్ తీరు ప్రభుత్వ అధికారిలా కాకుం డా, బీఆర్‌ఎస్ పార్టీ ఏజెంటులా ఉందన్నా రు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ఒత్తిడికి తలొగ్గి, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అంటే భయం.. అక్రమ నిర్మాణాలు అంటే ప్రియం అన్నట్లుగా కమిషనర్ వ్యవహారశైలి ఉందన్నారు. ఇప్పటికైనా కమిషనర్ తన వైఖరి మార్చుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.