రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

16-11-2026 | 08:41pm

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు..

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

హరీశ్ రావు అవినీతిపై అన్ని ఆధారాలూ సీఎంకు అందజేస్తాం: కవిత

బోధన్, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kavitha) డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి కరువు మండలాలుగా ప్రకటించాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు.

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కవిత అన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు.

ఇంటర్ బోర్డు రద్దుపై రౌండ్ టేబుల్ సమావేశం

ఇంటర్ బోర్డు రద్దు అంశంపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అదేవిధంగా భైరవ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, యాత్రను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హరీశ్ రావు అవినీతిపై ఆధారాలు సీఎంకు అందజేస్తాం

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా చట్టపరంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఇప్పటికే విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీకి లేఖల ద్వారా సంబంధిత ఆధారాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రైతుల సమస్యలు, కరువు పరిస్థితులు, విద్యారంగ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, మరోవైపు హరీశ్ రావుపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు