ప్రచార ఆర్భాటంతోనే సరి!?
- ప్రజాసమస్యల పరిష్కారం ఏదీ
- కాగితాలపై స్వచ్ఛత,క్షేత్రస్థాయిలో అపరిశుభ్రత
- రోజుకో కార్యక్రమం ప్రజలకు మాత్రం తప్పని ఇక్కట్లు
- ప్రజావాణిలో వినతులు వందలు,పరిష్కారాలు ఎక్కడ?
- మియాపూర్ సర్కిల్ అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
శేరిలింగంపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) (సీఎంసీ) ప్రచార ఆర్భాటానికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛత, పారిశుధ్యం పేరుతో రోజుకో కార్యక్రమం నిర్వహిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపైనే మురుగునీరు..
ముఖ్యంగా మియాపూర్ సర్కిల్ (49) పరిధిలోని చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ రోడ్ నంబర్ 4లో శ్రీదేవి సినిమా హాల్ ఎదురుగా రోడ్డుపై మురుగునీరు నిలిచిపోయి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నా సీఎంసీ, జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ..
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వందలాది ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటి పరిష్కారంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వన్ డే.. వన్ వర్డ్ వంటి కార్యక్రమాలు, పారిశుధ్య అవగాహన, అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.
ప్రజావాణిలో వినతులు స్వీకరించడం, సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు ఇవ్వడమే కాకుండా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్య అధికారులపై చర్యలేవి?
ఇప్పటికైనా సీఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు స్పందించి మియాపూర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి జవహర్ కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారుల పనితీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రచార ప్రకటనలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించినప్పుడే అధికారుల పనితీరుకు గుర్తింపు లభిస్తుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.