అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

16-11-2026 | 05:30am
  1. శంకర్‌పల్లి సీఐ రుద్వీర్ కుమార్ 
  2. అక్రమ మద్యం విక్రయాలపై ఫ్యూచర్ సిటీ పోలీసుల ఉక్కుపాదం
  3. పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదు, 42 లీటర్ల మద్యం స్వాధీనం

శంకర్‌పల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని శంకర్ పల్లి సిఐ రుద్వీర్ కుమార్(Shankarpalli CI Rudveer Kumar) హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వేద గ్రామంలో ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి బెల్ట్ షాపులపై, కిరాణా దుకాణాలపై, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై ఏకకాలంగా దాడులు నిర్వహించారు.

గ్రామంలో అక్రమంగా మద్యం నిర్వహిస్తున్న 8 షాపుల యజమానులపై కేసు నమోదు చేశారు. వివిధ రకాల బ్రాండ్ల కు చెందిన 141 మద్యం సీసాలు (సుమారు 42 లీటర్లు) మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని వివిధ రకాల షాపులపై దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మధ్యాన్ని కొనుగోలు చేసి కిరాణా షాపుల్లో, ఫస్ట్ ఫుడ్ సెంటర్లలో, జనరల్ స్టోర్ లలో మద్యాన్ని నిలువ చేసి అక్రమంగా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మద్యాన్ని కూడా సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

అక్రమంగా బెల్ట్ షాపుల్లో మధ్యాన్ని విగ్రహించడం వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని, వారి తల్లి దండ్రులు కూడా వారి పై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. 

మరిన్ని వార్తలు