కబ్జా కోరల్లో ‘రాచకాల్వ’!
- 28 ఎకరాల శిఖం భూమి.. 3 ఎకరాలకు కుదింపు
- పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 354లో యథేచ్ఛగా ఆక్రమణలు
- సంయుక్త సర్వే పేరుతో అధికారుల కాలయాపన
- కళ్లముందే నిర్మాణాలు సాగుతున్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం
- ప్రమాదంలో వరద నీటి పారుదల వ్యవస్థ..
- ఆందోళనలో స్థానికులు
అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 15 (విజయక్రాంతి): సిటీ శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ, నీటిపారుదల భూములపై పడింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) (ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్) పరిధిలోని పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 354లో ఉన్న చారిత్రాత్మక ‘రాచకాల్వ’ శిఖం భూమి అన్యాక్రాంతమవుతోంది.
గతంలో సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో కళకళలాడిన ఈ కాల్వ శిఖం, నేడు కబ్జాదారుల ధాటికి కేవలం 3 ఎకరాలకు పరిమితమవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమన్వయ లోపం.. కబ్జాదారులకు వరం..
కాల్వ శిఖం భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు పలు మార్లు సంబంధిత శాఖలకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులు ’సంయుక్త సర్వే’ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం కొరవడటం కబ్జాదారులకు వరంగా మారింది. ఒక శాఖపై మరొక శాఖ నెపం నెడుతూ కాలం వెళ్లదీస్తుండటంతో, క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయి.
ముంపు ముప్పు పొంచి ఉంది..
పెద్ద అంబర్పేట్ పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు దిగువకు వెళ్లడానికి ఈ రాచకాల్వ అత్యంత కీలకం. ప్రస్తుతం కాల్వ హద్దులను చెరిపేసి, బఫర్ జోన్, శిఖం భూముల్లో ఏకంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే వర్షాకాలంలో వరద నీరు వెళ్లే మార్గం లేక చుట్టుపక్కల కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికుల్లో ఆందోళన..
28 ఎకరాల కాల్వ 3 ఎకరాలకు కుచించుకుపోయే వరకు అధికారులు ఏం చేస్తున్నారు? ఫిర్యాదులు అంది నా సంయుక్త సర్వే నిర్వహించడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? కాల్వ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఎందుకు అడ్డుకోవడం లేదు? సర్వే పూర్తయ్యేలోపు మిగిలిన 3 ఎకరాలు కూడా కబ్జాకు గురైతే ఎవరిది బాధ్యత?తక్షణమే హద్దులు నిర్ణయించాలి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే నంబర్ 354లోని కాల్వ అసలు విస్తీర్ణాన్ని తేల్చి, హద్దు రాళ్లు పాతడంతో పాటు అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి రాచకాల్వను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంయుక్త సర్వే నిర్వహిస్తాం..
‘పెద్ద అంబర్పేట్ సర్వే నంబర్ 354లో ఉన్న రాచకాల్వ శిఖం భూమిపై పూర్తిస్థాయిలో సంయుక్త సర్వే నిర్వహిస్తాం. సర్వే కోసం ఇప్పటికే రెవెన్యూ అధికారులకు లేఖ రాశాము. త్వరలోనే సర్వే పూర్తి చేసి హద్దులను గుర్తిస్తాం.‘
భావన రెడ్డి, ఇరిగేషన్ ఏఈ