ఇందిరమ్మ జీవిత బీమా.. నిరుపేద కుటుంబాలకు ధీమా!
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
- ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ కవచం
- ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
- సూర్యాపేట జిల్లాలో సుమారు 3,29,974 కుటుంబాలకు లబ్ది చేకూరేలా కార్యాచరణ
- అర్హుల గుర్తింపు, పారదర్శక నమోదు ప్రక్రియపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
సూర్యాపేట, నవంబర్ 15 (విజయక్రాంతి) : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం(Telangana People's Government) మరో ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుటుంబానికి ఆధారంగా నిలిచే కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలిచేందుకు, వారి బతుకుకు భరోసా కల్పించేందుకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’(Indiramma Family Life Insurance) ను ప్రవేశపెడుతోంది.
ఈనెల 19న ప్రారంభం :
ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం రాష్ట్రంలోని లక్షలాది కుటుం బాలకు భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పించనుంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
పేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకే.. :
సాధారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఒక్కసారిగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల్లో కుటుంబ పెద్ద మరణం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల పోషణ, గృహ అవసరాలు, అప్పుల చెల్లింపులు వంటి బాధ్యతలు భారంగా మారుతాయి.
రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించే కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుం బాలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూ పొందించింది.
కుటుంబానికి సంపాదన అం దించే వ్యక్తి మరణించిన సందర్భంలో రూ.5 లక్షల బీమా మొత్తం అందించడం ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. కష్టకాలంలో ప్రభు త్వం తమకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని పేద కుటుంబాల్లో కల్పించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఆశయం.
కుల మతాలకు అతీతంగా..:
అయితే ఈ పథకంలో కుల, మతాలకు తావు లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ఉపాధి పొందుతూ కు టుంబ పోషణకు తోడ్పడుతున్న అర్హత కలిగిన వ్యక్తికి ఈ జీవిత బీమా వర్తిస్తుంది.
బీమా రక్షణ ఎవరికనేది కుటుంబ సభ్యుల చేతుల్లోనే.. :
18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి కుటుంబంలో సంపాదించే ఓ సభ్యుడిని బీమా పరిధిలోకి తీసుకుంటా రు. అయితే ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నట్లయితే,
వారిలో ఎవరికి జీవిత బీమా రక్షణ కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించు కోవచ్చు. తద్వారా ప్రతి కుటుంబానికి తమ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించబడింది.
నామినీ ఎంపికలోనూ వారికే స్వేచ్ఛ:
ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశం నామినీ ఎంపిక. బీమా పొందే వ్యక్తి తన కు టుంబ సభ్యుల్లో ఒకరిని లేదా పలువురిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.అంతేకాకుండా, బీమా మొత్తం రూ.5 లక్షలను నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించబడుతుంది. దీంతో బీమా మొత్తం పంపి ణీ విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయం ఉం టుంది కాబట్టి తదుపరి వారి మధ్య వివాదాలకు అవకాశం ఉండదు.
ఆధార్ కార్డుల ఆధారంగా అర్హుల గుర్తింపు:
పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోనున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హుల వివరాలను సేకరించనున్నారు.
ఐదు రోజులు విస్తృత ప్రచారం :
ప్రజలకు ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి 18 వరకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో డప్పు చాటింపు, దండోరా ద్వారా.. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 19 నుంచి ప్రత్యేక నమోదు కేంద్రాలు :
ఈ నెల19న పథకం ప్రారంభమైన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా అర్హులైన కుటుంబాల నుంచి వివరాలు సేకరించి నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ నుంచి నామినీ వివరాల వరకు డిజిటల్ విధానంలో నమోదు చేయనున్నారు.సూర్యాపేట జిల్లాలో సుమారు 3,29,974 కుటుంబాలకు బీమా భరోసా!: జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3,29,974 కుటుంబాలకు పథకం వర్తించేలా కార్యాచరణ రూ పొందించారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 486 గ్రామ పంచాయతీల ద్వారా 2,41,188 కుటుంబాలకు,
ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డుల ద్వారా 88,746 కుటుంబాలకు ఈ పథకంపై అవగాహన కల్పించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి మొత్తం 627 గ్రామ పంచాయతీలు, వార్డుల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గొప్ప సామాజిక భద్రతా కార్యక్రమం
కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అందించే రూ.5 లక్షలు పిల్లల చదువులు,
కుటుంబ పోషణ, ఇతర అత్యవసర అవసరాలకు తోడ్పడుతుంది. ఇది గొప్ప సామాజిక భద్రత కార్యక్రమం కావున జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్, సూర్యాపేట జిల్లా