తుంగభద్ర హారతితో పులకించిన భక్తజనం
భక్తిపారవశ్యంలో మునిగిన భక్తులు.. ఆధ్యాత్మిక శోభతో అలంపూర్
అలంపూర్, నవంబర్ 16: కార్తీక మాసం పర్వదినం సందర్భంగా పుణ్యక్షేత్రమైన అలంపూర్‌లో(Alampur, a pilgrimage site) భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.కార్తీక సోమవారం వేళ తుంగభద్ర నది తీరంలో నిర్వహించిన హారతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి లోను చేసింది. జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల సమీపంలోని తుంగభద్ర నది తల్లికి సోమవారం రాత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించారు.
నదీమతల్లికి దీపహారతి ఇస్తుండగా తీరమంతా భక్తి వాతావరణం నెలకొంది.అంతకుముందు ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారు, స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తుంగభద్ర హారతిని కనులారా వీక్షిస్తూ, దీపాల వెలుగుల్లో నదీమతల్లిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.